‘నేను భారతీయ మహిళను. దేనికీ భయపడను. నన్నెవరూ భయపట్టలేరు’ అంటూ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సంచనల వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె మీడియాతో మాట్లాడారు. ”ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్నా, ఇప్పటికీ ఏదో విధంగా వివక్షకు గురవుతూనే ఉన్నారు. మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదని, అత్యున్నత పదవిలో ఉన్న మహిళలకూ కూడా పలు అవమానకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఏ స్త్రీ తన స్వార్థం కోసం ఏదీ కోరుకోదు. ప్రతిదీ తన కుటుంబం కోసమే ఆలోచిస్తుంది” అని గవర్నర్ తమిళిసై అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా ‘నేను భారతీయ మహిళను. ఎవరికీ భయపడను. దేనికీ భయపడను. నన్నెవరూ భయపెట్టలేరు’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు ప్రపంచ వ్యాప్తంగా ప్రేమాభిమానాలు పంచుతూ శాంతియుత జీవనం కొనసాగేందుకు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని గవర్నర్ గుర్తు చేశారు. మహిళలు జీవితంలో సవాళ్లను ఎదుర్కొంటున్నా ఆర్థిక స్వతంత్రం, ఆరోగ్యవంతంగా ప్రతీ క్షణం జీవితాన్ని ఆస్వాదించాలన్నారు. మహిళలు సాధించిన అద్భుత విజయాలను గుర్తు చేసుకొని వారిని గుర్తించడం మహిళా దినోత్సవం ఉద్దేశమని ఆమె అన్నారు.
మరోపక్క సోమవారం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు మొదలైయ్యాయి. దీంతో బీజేపీ పార్టీ నాయకులు మండిపడ్డారు. కేసీఆర్ తీరుపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళ్ సై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.