బీజేపీలోకా? కోర్టుకు ఈడుస్తా: కోమటిరెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీలోకా? కోర్టుకు ఈడుస్తా: కోమటిరెడ్డి

June 13, 2019

I Am Not Changing Congress Party.. Bhuvanagiri mp komatireddy venkat reddy.

కోమటి‌రెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు నిన్నటి నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం వారిద్దరూ ఇప్పటికే బీజేపీ జాతీయ స్థాయి నేతలతో మంతనాలు కూడా జరిపినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే అదంతా అబద్ధమని, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తేల్చి చెప్పారు.  

‘నేను పార్టీ మారడం లేదు. నేను చచ్చేదాక కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. నేను చనిపోతే నా శవంపై కాంగ్రెస్ జెండానే ఉంటుంది. పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం.  మేం పార్టీలు మారే వ్యక్తులం కాదు. మాకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ జన్మనిచ్చింది. అలాంటి పార్టీని ఎన్నటికీ వీడం’ అని కోమటిరెడ్డి అన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో  భువనగిరి నుంచి గెలిచిన  కోమటిరెడ్డి, మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డిలు  భారతీయ జనతా పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. వీరు ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్‌తో మంతనాలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి పీసీసీ పగ్గాలు కోమటిరెడ్డి బ్రదర్స్ కే వస్తాయని వెంకటరెడ్డి ఎంతో ధీమాతో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి  గట్టి పట్టు ఉందని కోమటిరెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు.