తెలంగాణకు తర్వాతి సీఎంను నేనేనేమో.. కిషన్ రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణకు తర్వాతి సీఎంను నేనేనేమో.. కిషన్ రెడ్డి

January 20, 2020

Kishan Reddy.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రిని తానే కావొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలోని బీజేపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆయన మాట్లాడుతూ.. ‘2024లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. సీఎం అభ్యర్థి ఎవరనేది జాతీయ నాయకత్వమే నిర్ణయిస్తుంది. నేనే ముఖ్యమంత్రిని కావచ్చు లేదా సాధారణ కార్యకర్త అయినా కావచ్చు’ అని వెల్లడించారు. అయితే తాను సీఎం అభ్యర్థి అంటూ జరుగుతున్న ప్రచారం ఊహాజనితమేనని కొట్టిపారేసి ఆశ్చర్యపరిచారు. ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. 

తెలంగాణలో అమలు చేస్తున్న అనేక పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తోందని చెప్పారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేస్తారని వస్తున్న ఊహాగానాలపైనా ఆయన స్పందించారు. కేంద్రం వద్ద అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు. ఇక షిర్డీ అంశంతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. త్వరలోనే అయోధ్యలో అదిరిపోయే రామాలయం కడతామని తెలిపారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి అభ్యర్థిపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.