I am the one who scolded Trivikram, but what.. Bandla Ganesh on the audio leak..
mictv telugu

త్రివిక్రమ్‌ను తిట్టింది నేనే, అయితే ఏంటీ.. ఆడియో లీక్‌‌పై బండ్ల గణేష్..

October 3, 2022

ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్‌కి ఎంతమంది అభిమానులున్నా.. బండ్ల గణేష్ వీరాభిమానం వేరే లెవెల్‌లో ఉంటుంది. చిత్రవిచిత్ర పదజాలంతో పవనన్నను బండ్లన్న పొగిడే తీరు సోషల్ మీడియాని షేక్ చేస్తుంటుంది. మెగా ఫ్యామిలీకి అభిమానిని అని చెప్పుకునే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌ను దేవుడిగా సంబోధిస్తుంటాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్లలో అయితే ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ప్రసంగిస్తాడు. పవన్ కళ్యాణ్ కోసం ఎంతమంది వస్తారో.. బండ్ల గణేష్ స్పీచ్ కోసం అంతే స్థాయిలో క్రేజ్ ఉంటుంది. రానురాను బండ్లన్న మేనియా ఎలా తయారైందంటే.. పవన్ కళ్యాణ్ ప్రసంగాలకు వచ్చే వ్యూస్ కంటే బండ్ల గణేష్ వీడియోలు బ్లాక్ బస్టర్ అవ్వటం మొదలయ్యాయి. దీన్ని పవన్ కళ్యాణ్ కూడా గుర్తించి.. ‘నేను బండ్ల గణేష్ లా మాట్లాడలేనబ్బా’ అని ఓ వేదికపై ఓపెన్‌గా చెప్పేశాడు.

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అయితే పవన్ కళ్యాణ్ స్పీచ్ కంటే.. బండ్లన్న ప్రసంగానికే ఎక్కువ మార్కులు పడ్డాయి. దీంతో భీమ్లా నాయక్ ఈవెంట్‌కు బండ్లన్నను దూరం పెట్టేశారట. భీమ్లా నాయక్ ఈవెంట్ కోసం బండ్లన్న స్పీచ్ రెడీ చేసుకున్నాడట కూడా. తన దేవుడిని పొగిడేందుకు కొన్ని లైన్స్ రాసుకున్నాడట. కానీ చివర్లో త్రివిక్రమ్ ట్విస్ట్ ఇచ్చాడట. భీమ్లా నాయక్ ఫంక్షన్‌కు బండ్ల గణేష్ ఆహ్వానం దక్కలేదు. ఈ విషయం ఫ్యాన్స్‌కు లీక్ కావటంతో బండ్ల గణేష్‌కు కాల్స్ చేసి.. మీరు ఎలాగైనా ఈవెంట్‌కు రావాలని వేడుకున్నారు కూడా. ఇదంతా ఒక ఆడియో రూపంలో సోషల్ మీడియాలో లీక్ అయింది. అయితే ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కావాలని నన్ను భీమ్లా నాయక్ ఈవెంట్‌కు పిలవటం లేదని.. అతనికంటే నాకు ఎక్కువ క్రేజ్ వస్తుందని బయపడుతున్నాడని.. త్రివిక్రమ్ ని కాస్త గట్టిగానే ఏసుకున్నాడు బండ్ల.

అయితే అప్పట్లో ఆ ఆడియో తనది కాదని కూడా క్లారిటీ ఇచ్చాడు బండ్ల గణేష్. ఆ ఆడియో లీక్‌కు తనకేం సంబంధం లేదని చెప్పిన బండ్ల గణేష్ ఇప్పుడు నాలుక మడత పెట్టేశాడు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో.. ‘అవును అప్పుడు త్రివిక్రమ్ ని తిట్టింది నేనే’ అని ఒప్పుకున్నాడు. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ త్రి విక్ర‌మ్‌ని తిట్టిన వాయిస్ నాదే. అప్పుడేదో కోపంలో తిట్టాను. దానికి ఆయనకు సారీ కూడా చెప్పాను అని బండ్ల గణేష్ అన్నారు. ఏదైతేనేం చాలా రోజులకు బండ్ల గణేష్ తన విషయంలో నిజాన్ని నిర్భయంగా చెప్పాడు. ఇప్పుడు బండ్ల గణేష్ నిజాన్ని ఒప్పుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే బండ్ల గణేష్ రాని భీమ్లా నాయక్ ఈవెంట్‌లో.. త్రివిక్రమ్ కూడా మాట్లాడలేదు. అసలు ఆ ఈవెంట్‌కు త్రివిక్రమ్ వచ్చాడా? లేదా? అన్నట్టుగా మారిపోయింది ఆ సభ.