'I am very happy today...': Nitin Gadkari as India sets Guinness World Record
mictv telugu

ఏకధాటిగా 75 కి.మీ. రహదారి నిర్మాణం.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌

June 8, 2022

కేంద్రంలోని మోడీ సర్కార్ మరో ఘనతను సాధించి అరుదైన ప్రపంచ రికార్డును దక్కించుకుంది. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) ఒకే వరుసలో 75 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించి గిన్నిస్ వరల్డ్ రికార్డులో పేరు దక్కించుకున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ వెల్లడించారు. అత్యధిక పొడవైన రోడ్ నిర్మించినందుకుగానూ ఈ ఘనత దక్కింది. నేషనల్ హైవే 53ను 75కిలోమీటర్ల పాటు నిర్మించిన రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు జగదీశ్ కదమ్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మహారాష్ట్రలోని అమరావతి.. అకోలా జిల్లాల మధ్య వేసిన ఈ రహదారి.. అతి తక్కువ సమయంలో 105 గంటల 33 నిమిషాలలో రహదారిని పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కైవసం చేసుకుంది,

ఈ జాతీయ రహదారి నిర్మాణం ఐదు రోజుల్లోనే పూర్తయింది. దీంతో అంతకుముందు ఖతార్‌ పేరిట ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది. ఈ రికార్డుకు సంబంధించిన వివరాలను కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. గిన్నిస్‌ రికార్డ్‌ సర్టిఫికెట్‌తో పాటు రోడ్డు నిర్మాణ ఫొటోలను ఆయన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఎన్‌హెచ్‌ఏఐకి చెందిన 800 మంది ఉద్యోగులు, ఇండిపెండెంట్ కన్సల్టెంట్‌లతో సహా ప్రైవేట్ కంపెనీకి చెందిన 720 మంది కార్మికులు ఈ పనులను రికార్డు సమయంలో పూర్తి చేశారు. జూన్ 3వ తేదీ ఉదయం ఏడు గంటల ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కాగా.. జూన్ 7 సాయంత్రం 5 గంటలకు విజయవంతంగా పూర్తి అయినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.