రాజకీయాల్లోకి నేనే తీసుకొచ్చా : సీఎం వైఎస్ జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

రాజకీయాల్లోకి నేనే తీసుకొచ్చా : సీఎం వైఎస్ జగన్

March 28, 2022

దివంగత మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభ ఇవ్వాళ నెల్లూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరై గౌతమ్ చిత్ర పటానికి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. గౌతమ్ రెడ్డిని తానే రాజకీయాల్లోకి తీసుకొచ్చానని వెల్లడించారు. తన ప్రతీ అడుగులో తోడుండేవారనీ, వయసులో పెద్దవాడైనా, స్నేహితుడిగా ఉండేవాడని గుర్తు చేసుకున్నారు. గౌతమ్ రెడ్డి లేడనే విషయాన్ని నమ్మడం మనసుకు చాలా కష్టంగా ఉందని భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఎంతో శ్రమించారని, పెట్టుబడులు వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేవారన్నారు. చివరి క్షణం వరకు రాష్ట్రం కోసం కష్టపడ్డ ఆయన కుటుంబానికి తనతో పాటు పార్టీ మొత్తం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గౌతమ్ రెడ్డికి గుర్తుగా సంగం బ్యారేజీకి ఆయన పేరు పెడతామని మరోమారు స్పష్టం చేశారు.