నన్నేం చేయలేరు: రఘునందన్ రావు - MicTv.in - Telugu News
mictv telugu

నన్నేం చేయలేరు: రఘునందన్ రావు

June 7, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇటీవలే ఓ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్‌ జరిగిన సంఘటన ఎంత కలకలం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను, ఫొటోలను తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియా సమక్షంలో విడుదల చేశారు. నిందితురాలి వివరాలను బయటపెట్టారనే ఆరోపణలతో మంగళవారం ఆయనపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి, ఐపీసీ సెక్షన్ 228 (ఏ) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.

రఘునందన్ రావు మాట్లాడుతూ.. ”మైనర్ బాలికకు న్యాయం చేయాలని నేను పోరాడుతుంటే, పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారు. ఇలాంటి కేసులకు నేను భయపడే వాడిని కాదు. కేసులు నాకు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో 70కి పైగా కేసులను ఎదుర్కొని ఇంత వరకు వచ్చాను. ఈ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నందున టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మౌనంగా ఉన్నాయి. మీకు కేసు వాదించేందుకు లాయర్లు కావాలి. నాకు ఆ అవసరం లేదు. సుప్రీంకోర్టు వరకు నేనే వాదించుకోగలను” అని ఆయన అన్నారు.

అనంతరం మీకు చిత్తశుద్ధి ఉంటే మైనర్ బాలిక జీవితాన్ని నాశనం చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడిని అరెస్ట్ చేసి, శిక్షపడేలా చూడండి అంటూ సవాల్ విసిరారు. అబిడ్స్ పోలీసులు మాట్లాడుతూ..” బీజేపీ ఎమ్మెల్యేపై నేడు ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఫిర్యాదు చేశారు. దాంతో రఘునందరావుపై కేసు నమోదు చేసి, విచారణకు హాజరుకావాలని సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వబోతున్నాం” అని అన్నారు. ఈ క్రమంలో రఘునందరావు పోలీసులు నన్నేం చేయలేరు అంటూ ఘాటుగా స్పందించారు.