‘ఆర్ఎస్ఎస్’ కథ విని ఏడుపొచ్చింది : రాజమౌళి సంచలన వ్యాఖ్యలు
సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న రాజమౌళి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి రాసిన ‘ఆర్ఎస్ఎస్’ స్క్రిప్టు చదివి ఏడుపొచ్చేసిందని, అంత హృద్యంగా రాశారని వెల్లడించారు. ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చరిత్ర గురించి నాకు తెలియదు. అది ఒక సంస్థగానే తెలుసు. అది ఏ విధంగా ఏర్పడింది? దాని భావజాలం ఏంటీ? ఆ విధంగా నమ్మకం ఏర్పరచుకోవడానికి కారణం ఏంటీ? అనే విషయాలు నాకు తెలియవు. కానీ మా నాన్న రాసిన స్క్రిప్టు చదివి కన్నీళ్లు పెట్టుకున్నాను. ఆ కథలో చాలా భావోద్వేగాలు ఉన్నాయి. ఆ స్క్రిప్టుకు దర్శకత్వం వహించే అవకాశం నాకు వస్తుందో లేదో తెలియదు. ఆ కథను మా నాన్న ఎవరి కోసం రాశారో కూడా తెలియదు. కానీ ఆ కథతో సినిమా తీసే అవకాశం వస్తే గౌరవంగా భావిస్తాను’ అంటూ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కాగా, రాజమౌళి తీసే సినిమాలన్నింటికీ ఆయన తండ్రి విజయేంద్రప్రసాదే కథను అందిస్తారని తెలిసిందే. కొద్దికాలం క్రితం ఆర్ఎస్ఎస్‌పై స్క్రిప్టు రాస్తున్నానని విజయేంద్రప్రసాదే స్వయంగా వెల్లడించారు. దీంతో పాటు ఆర్ఆర్ఆర్ సీక్వెల్, భజరంగీ భాయిజాన్ సీక్వెల్‌తో పాటు మహేశ్ సినిమాకు స్క్రిప్టు రాసే పనిలో ఉన్నారు.