నేటితరంలోని కొంతమంది అమ్మాయిలను చూస్తే వారిది అమాయకత్వమా? లేక వెర్రితనమా? అనే ఆలోచన వస్తుంది. నిరక్షరాస్యులే కాదు. బాగా ఉన్నత చదువులు చదివిన యువతులు కూడా సిల్లీగా మోసపోతున్నారు. వీరు మోసపోయిన విధానం చూస్తే స్కూలు పిల్లాడికి కూడా జాలేస్తుంది. అటువంటి ఒక ఘటన హైదరాబాదులో జరిగింది. మలక్పేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
దిల్ సుఖ్ నగర్లో హాస్టల్లో ఉంటూ ఎమ్మెస్సీ చదువుతున్న ఓ యువతికి శివరాంపల్లికి చెందిన పెయింటర్ మహమ్మద్ మోసిన్ (22) అనే యువకుడు రాజు అనే పేరుతో పరిచయమయ్యాడు. తన సెల్ఫోన్ నుంచి తరచూ ఆమెతో మాట్లాడేవాడు. అయితే అమ్మాయి ఏమనుకుందంటే.. కొన్నాళ్ల క్రితం తనతో ప్రేమలో ఉండి విడిపోయిన ఇంకో రాజు అని అనుకుందంట. అలా అనుకోవడమే కాకుండా గట్టిగా నమ్మి హద్దులు మీరి చాటింగ్ చేసేసింది. కొన్ని రోజులకు మోసిన్ అలియాస్ రాజు నగ్న చిత్రాలను పంపమని యువతిని కోరగా, సదరు యువతి మాజీ లవర్ రాజు అనుకొనే వాటిని మొబైల్ ద్వారా పంచుకుంది. అయితే ఎన్నాళ్లిలా ఫోన్లోనే మాట్లాడుకుంటాం? ఓ సారి ఫేస్ టు ఫేస్ కలుద్దామని నిర్ణయించుకున్నారు. తీరా ఒకరికొకరు తారసపడే సరికి నగ్న చిత్రాలు పంపిన యువతి షాక్కు గురైంది. తను మాజీ లవర్ రాజు కాదు మరో వ్యక్తి అని అర్ధమైంది. దాంతో తాను పంపిన నగ్న చిత్రాలను మొబైల్ నుంచి తొలగించాలని కోరగా, మోసిన్ నిరాకరించాడు. అంతటితో ఆగక డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు దిగాడు. లేకపోతే ఫోటోలను వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో ఆగ్రహించిన యువతి షీటీమ్స్కి ఫిర్యాదు చేసింది. వారు నిందితుడిని పట్టుకొని మలక్పేట పోలీసులకు అప్పగించారు.