మురారి, ఇంద్ర, మన్మథుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలతో తెలుగు నాట మంచి పేరు తెచ్చుకున్న నటి సోనాలి బింద్రే. తర్వాత క్యాన్సర్ బారిన పడి విదేశాల్లో చికిత్స తీసుకొని కోలుకుంది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటూ సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఇటీవల ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో సోనాలి పేరు వినపడింది కానీ, వాటిని ఆమె కొట్టివేసింది. అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పేసింది.
తాజాగా ఆమె నటించిన ఓ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉండగా, ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా కెరీర్ తొలినాళ్లలో ఎదురైన అనుభవాలను పంచుకొంది. ‘ఒక సమయంలో నాకు డబ్బులు చాలా అవసరమయ్యాయి. రూం రెంటు, బిల్లులు వగైరా వాటికి నా వద్ద అప్పుడు డబ్బు లేదు. కుటుంబం ఆర్ధికంగా కష్టాల్లో ఉంది. అందుకే ఎలాంటి పాత్రలైనా చేసుకుంటూ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. కొన్ని సినిమాలను ఒప్పుకున్నప్పుడ అసలెందుకు ఒప్పుకున్నానా? అని అనిపించేది. కానీ, ఆర్ధిక సమస్యలు గుర్తుకు వచ్చి వారు పేమెంట్ ఎప్పుడిస్తారో అని ఎదురు చూసేదాన్ని. అతిగా ఆలోచిస్తే కష్టాలు పోవని అర్ధమైంది. అందుకే వచ్చిన పాత్రలను వచ్చినట్టు చేసుకుంటూ పోయాను. తర్వాత వాటిని నేనూ చూడలేదు. మీరూ (ప్రేక్షకులు) చూడలేద’ని వివరించింది.