నాకు పెళ్లి ఇష్టం లేదు.. వచ్చి తీసుకుపో: సృజన - MicTv.in - Telugu News
mictv telugu

నాకు పెళ్లి ఇష్టం లేదు.. వచ్చి తీసుకుపో: సృజన

May 23, 2022

 

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా మధురవాడకు చెందిన సృజన అనే యువతి ఇటీవలే పెళ్లిపీటలపైనే కుప్పకూలి, చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఎంత కలకలం రేపిందో తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు సోమవారం ఘటనకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించారు.”సృజన ఫోన్‌ కాల్ డయల్ రికార్డ్‌ర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ను పరిశీలించాం. దాంతో పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. విశాఖనగరంలోని పరవాడకు చెందిన తోకాడ మోహన్ అనే యువకుడితో ఏడేళ్లుగా సృజన ప్రేమలో ఉంది. పెళ్లికి మూడు రోజుల ముందు ప్రియుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో ఛాటింగ్ చేసింది.

ఇంట్లో వాళ్లు చేస్తున్న పెళ్లి ఆమెకు ఇష్టం లేదని, వచ్చి తీసుకెళ్లామని మోహన్‌ను సృజన కోరింది. కానీ, మోహన్ తాను ఆర్థికంగా ఇంకా స్థిరపడలేదని, సరైన ఉద్యోగం లేదంటూ పెళ్లికి నిరాకరిస్తూ వచ్చాడు. కొంత సమయం నిరీక్షించాలని సృజనను కోరాడు. దాంతో మనస్తాపానికి గురైన సృజన..పెళ్లి ఆపాలనే ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకుంది. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం” అని పోలీసులు నిర్ధారించారు.

మరోపక్క సృజనకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ఈ నెల 11న వేరే వ్యక్తితో ముహుర్తం ఖారారు చేశారు. దాంతో ఆ యువతి ఇష్టం లేని పెళ్లిని ఏలాగైనా ఆపుతానని మోహన్‌కు హామీ ఇచ్చినట్లు సమాచారం. దాంతో ఆమె విష పదార్ధం తీసుకుంది. కానీ, ఊహించని రీతిలో పెళ్లిపీటలపైనే కుప్పకూలి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.