'నేను లంచం తీసుకోను' బోర్డు పెట్టుకున్న అధికారి - MicTv.in - Telugu News
mictv telugu

‘నేను లంచం తీసుకోను’ బోర్డు పెట్టుకున్న అధికారి

November 17, 2019

telangana government  

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనం ఘటన మొత్తం రెవెన్యూశాఖను కుదిపేసింది. పనుల కోసం వచ్చేవారు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో అనే భయం వారిని పట్టుకుంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పలువురు అధికారులు తమను తాము రక్షించుకునే పనిలో పడ్డారు. ఈ భయం పొరుగు రాష్ట్రం ఏపీలో కూడా కనిపించింది. కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మార్వో దాడి ఘటనలు జరగకుండా ముందుగానే తన చాంబర్‌లో ఏకంగా తన టేబుల్‌కు ముందు అడ్డంగా ఓ  తాడు కట్టించిన సంగతి తెలిసిందే. 

దీంతో ప్రభుత్వ అధికారులు ఈ విధమైన రక్షణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. కానీ, లంచాలు తీసుకోమని చెప్పడంలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రభుత్వ అధికారి తాను లంచం తీసుకోను అని పెద్ద అక్షరాలతో తన ఆఫీసులో బోర్డు పెట్టించుకున్నారు. కరీంనగర్ ఎలక్ట్రిసిటీ సర్కిల్ ఆఫీసులో కమర్షియల్ ఏడీఈగా పనిచేస్తున్న పోడేటి అశోక్ ‘నేను లంచం తీసుకోను’ అంటూ పెద్ద అక్షరాలతో తన కార్యాలయంలో బోర్డు రాయించి పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. అందరూ నిజాయతీగా పనిచేస్తే అవినీతి రహిత వ్యవస్థ రూపుదిద్దుకుంటుందని ఆయన అన్నారు. దీనికి సంబందించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.