I don't understand what Harish Rao has in mind: Sajjala
mictv telugu

హరీష్ రావు మనసులో ఏముందో అర్థం కావటం లేదు: సజ్జల

September 30, 2022

ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల దారుణంగా వ్యవహరిస్తోందని, వారిపై కేసులు కూడా పెట్టి, అరెస్టులు చేయిస్తోందని తాజాగా తెలంగాణ మంత్రి హరీశ్ రావు పలు సంచలనమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో హరీష్ రావు వ్యాఖ్యలు గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

అయితే, హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఎవరు స్పందిస్తారని అటు ఉపాధ్యాయులు, ఇటు ప్రతిపక్షల నాయకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కాసేపటిక్రితమే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ”తెలంగాణ మంత్రి హరీష్ రావు మనసులో ఏముందో అర్థం కావటం లేదు. ఎందుకు పదే పదే ఏపీపైనే వ్యాఖ్యలు చేస్తున్నారు. హరీష్ రావు..మీ రాష్ట్ర విషయాలను మీరే చూసుకుంటే బాగుంటుంది. మీ వ్యాఖ్యలపై మేము ఘాటుగా స్పందిస్తే, మరింత రచ్చ కావడం తప్పా, మరేమీ ఉండదు. ఉపాధ్యాయులతో మా ప్రభుత్వం మంచిగా వ్యవహరిస్తోంది. వారికి ఇప్పటికీ ఏమైనా సమస్యలు ఉంటే చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హరీశ్ రావు..ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో. రైతుల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల మంచే జరుగుతుంది. దీనిపై ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు చేసే విమర్శలను మేం పట్టించుకోబోం” అని ఆయన అన్నారు.

తాజాగా ఏపీలో జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంపై నేడు జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేస్తూ, ప్రజల క్షేమం కోసం మరింత కష్టపడాలని ఎమ్మెల్యేలకు జగన్ సూచించారని సజ్జల తెలిపారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని, అందుకు ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ పీకారని తప్పుడు ప్రచారం చేశారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.