ఐపీఎల్ 15వ సీజన్ మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. ఈరోజు జరిగే మ్యాచ్‌లో పక్కగా ఈ జట్టునే గెలుస్తుంది అని ఊహిస్తున్న వారి అంచనాలను తారుమారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య రసవత్తరంగా మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.
ముందుగా టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ తొమ్మిది వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్.. నాలుగు వికెట్లు కోల్పోయి 190 పరుగులను చేసి, పంజాబ్ కింగ్స్‌పై గెలిచింది. అయితే, మ్యాచ్ చివరి దశలో గుజరాత్ గెలుస్తుందా – పంజాబ్ గెలుస్తుందా అనే ఉత్కంఠ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. అంతలోనే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గ్రీసులోకి అడుగుపెట్టాడు. కొద్ది కొద్దిగా పుంజుకుంటున్న సమయంలోనే రన్ఔట్ అయ్యాడు. అనంతరం తెవాటియా బరిలోకి దిగి.. ఓడిపోతుంది అని అనుకున్న మ్యాచ్‌ను లాస్ట్ ఓవర్, లాస్ట్ రెండు బంతులకు వెంట వెంటనే రెండు సిక్సర్లు బాది అభిమానుల అభిమానాన్ని చూరగొన్నాడు.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ”తెవాటియాకు హ్యాట్సాఫ్. క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు దిగి, హిట్టింగ్ ఆడటం చాలా కష్టం. ముఖ్యంగా ఒత్తిడిని జయించి ఈ స్థాయిలో రాణించడం అమోఘం” అని అన్నాడు. అదేవిధంగా శుభ్‌మన్ గిల్(59 బంతుల్లో 96 పరుగులు), సాయి సుదర్శన్(30 బంతుల్లో 35) పట్టుదలగా నిలబడిన కారణంగానే తాము చివరి వరకు మ్యాచ్‌ను తీసుకురాగలిగామని పేర్కొన్నాడు.
అనంతరం తెవాటియా మాట్లాడుతూ.. ‘జట్టు విజయం సాధిస్తే గొప్పగా ఉంటుంది. చివరి ఓవర్లో మేం ఎలా ఆడాలనే దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎలాగైనా సిక్సర్లు కొట్టాలని నేనూ, డేవిడ్ మిల్లర్ మాట్లాడుకున్నాం. చివరి బంతి నా బ్యాకు మధ్యలో తాకడంతో అది కచ్చితంగా బౌండరీ లైన్ క్లియర్ చేస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నా. అయితే, ఆ బంతిని ఒడియన్ స్మిత్ ఆఫ్ స్టంపకు దూరంగా వేస్తాడని ముందే ఊహించా. ఈ క్రమంలోనే పక్కాగా ఆ షాట్ ఆడటంతో సిక్సర్‌గా వెళ్లింది. చివరికి మేం విజయం సాధించడంతో డ్రెస్సింగ్ రూమ్ సంతోషంలో మునిగింది. మా కోసం కోచింగ్ సిబ్బంది ఆలివ్ నెహ్రా, గ్యారీ కిర్ స్టైన్ చాలా కష్టపడుతున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఆడాలని చెప్పారు. దీంతో మేం కూడా అలాగే ఆడుతూ విజయాలు సాధిస్తున్నాం’ అని తెవాటియా పేర్కొన్నాడు.