I have 40 MLAs with me: Eknath Shinde
mictv telugu

నాతో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు: ఏక్‌నాథ్‌ షిండే

June 22, 2022

మహారాష్ట్రలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ షిండే ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేశారు. తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం సూరత్‌కు వెళ్లిన ఆయన..బుధవారం ఉదయం చార్టెడ్ విమానంలో గువాహటి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. దాంతో బీజేపీ ఎంపీలు పల్లబ్ లోచన్ దాస్, సుశాంత బోర్గెహెన్ రిసీవ్ చేసుకున్నారు.

అనంతరం ఏక్‌నాథ్‌ షిండే మీడియాతో మాట్లాడుతూ..” నా వెంట మొత్తం 40 మంది శివసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి మద్దతు నాకు ధృడంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోను మా వర్గం చీలిపోదు. మరో ఆరుగురు స్వతంత్రులు కూడా నాకు మద్దతిస్తున్నారు. త్వరలోనే మేము గవర్నర్‌ను కలవాలని అనుకుంటున్నాం” అని ఆయన అన్నారు. సూరత్ హోటల్లో షిండే, తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో కలిసి దిగిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మరోపక్క ఉద్థవ్ ఠాక్రే కేబినెట్ భేటీకి పిలుపునిచ్చారు. తాజా రాజకీయ పరిణామాల నుంచి తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు నేడు కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. మంత్రులంతా తప్పనిసరిగా హాజరవ్వాలని ఆదేశించారు. సంక్షోభం నేపథ్యంలో అటు కాంగ్రెస్, ఎన్సీపీ కూడా తమ ఎమ్మెల్యేలతో వేర్వేరుగా సమావేశం కానుంది. ఈ క్రమంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ కరోనా బారిపడ్డారు. త్వరలోనే గవర్నర్‌ను కలవాలని ఎదురుచూస్తున్న షిండే కూటమికి నిరాశ ఎదురైంది.