తెలంగాణ‌లో నాకు ఎవ‌రితోనూ విభేదాలు లేవు: తమిళిసై - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ‌లో నాకు ఎవ‌రితోనూ విభేదాలు లేవు: తమిళిసై

April 6, 2022

Untitled-1

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని మోదీకి ఆమె ఫిర్యాదు చేయనుందని రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇటీవలే కేసీఆర్‌కు, గ‌వ‌ర్న‌ర్‌కు కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ నియామ‌కంలో వివాదం జరిగిందని వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే, బుధవారం కాసేపటి క్రితమే ఢిల్లీలో ప్ర‌ధాని మోదీతో ఆమె స‌మావేశయ్యారు. అనంత‌రం తమిళ్‌సై మీడియాతో మాట్లాడుతూ.. ”గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ నియామ‌కంలో వివాద‌మేమీ లేదు. తెలంగాణ‌ ప్ర‌భుత్వం ఒక పేరును సేవా రంగంలో ప్ర‌తిపాదించింది. అయితే, ప్ర‌భుత్వం నాకు సూచించిన ఆ వ్య‌క్తికి అర్హ‌త లేద‌ని నేను భావించాను.

నా అభిప్రాయాన్ని నేను చెప్పాను. రాజ్యాంగం, వ్య‌వ‌స్థ‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాలు గౌర‌వించి, వాటి ప్ర‌కార‌మే న‌డుచుకోవాల్సి ఉంటుంది. ప్ర‌ధానితో ప‌లు అంశాల‌పై చ‌ర్చించాను. ప్ర‌జా సంక్షేమ‌ కార్య‌క్ర‌మాల‌పై ఆయ‌న నాకు దిశానిర్దేశం చేశారు” అని ఆమె అన్నారు. అంతేకాకుండా తాను ప్ర‌ధానిని క‌లిసింది.. తెలంగాణ స‌ర్కారుపై ఫిర్యాదు చేసేందుకు కాద‌ని స్పష్టం చేశారు. తెలంగాణ‌లో త‌న‌కు ఎవ‌రితోనూ విభేదాలు లేవ‌ని ఆమె తేల్చి చెప్పారు.మరి కాసేప‌ట్లో ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.

మరోపక్క తెలంగాణ‌ బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగం లేకపోవడంపై త‌మిళిసై అప్ప‌ట్లోనే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఆమెకు వ‌రుస‌గా ప‌లు ప‌రిణామాలు చోటు చేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ అంశాల‌పై కేంద్ర మంత్రుల‌తో త‌మిళిసై చ‌ర్చిస్తార‌న్న ఊహాగానాలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఆమె నేడు మీడియా స‌మావేశంలో పూర్తి వివ‌ర‌ణ ఇచ్చారు.