I have that belief..we will see him like that again: Ganguly
mictv telugu

ఆ విశ్వాసం నాకుంది..మళ్లీ అతడిని అలా చూస్తాం: గంగూలీ

August 16, 2022

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంబంధించి, గతకొన్ని నెలలుగా ఇటు సోషల్ మీడియాలో, అటు క్రికెట్ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దానికి ప్రధాన కారణం.. సుదీర్ఘకాలంగా కోహ్లీ ఫామ్ కోల్పోయి, నానా ఇబ్బందులు పడుతుండటమే. ఈ క్రమంలో కోహ్లీని పక్కనబెట్టాలని కొందరు, కొన్నాళ్లపాటు పూర్తిగా అతడికి విశ్రాంతి ఇవ్వాలని మరికొందరు బీసీసీఐని కోరుతున్నారు.

ఈ విషయంపై తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పందించారు.”కంగారు పడకండి. అతన్ని ప్రాక్టీస్ చేయనివ్వండి. మ్యాచ్‌లు ఆడనివ్వండి. అతడు చాలా గొప్ప ప్లేయర్. వేలాది పరుగులు చేశాడు. అతడు త్వరలోనే పుంజుకుంటాడు. సెంచరీలు చేయలేకపోవచ్చు కానీ, ఆసియా కప్‌లో అతడిలో మునపటి ఫామ్‌ను చూస్తాం. నాకు ఆ విశ్వాసంగా ఉంది” అని గంగూలీ అన్నారు. ఇక, కోహ్లి బ్యాటింగ్‌పై గత కొంతకాలంగా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే.

కోహ్లీ బ్యాటింగ్ విషయానికొస్తే.. ‘2010 నవంబరు తర్వాత ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అర్ధ సెంచరీలకు కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. దీంతో అతడు విరామం తీసుకోవాలంటూ పలువురు విదేశీ దిగ్గజాలు ఇటీవల సూచనలు కూడా చేశారు. ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో కోహ్లి ఆడాడు. ఆ తర్వాత వెస్టిండీస్ సిరీస్‌లో అతడికి విశ్రాంతి కల్పించారు. ఆగస్టు 27 నుంచి జరిగే ఆసియా కప్ టోర్నీకి అతడిని ఎంపిక చేశారు. ఈ వారంలో జరిగే జింబాబ్వే పర్యటనలో కూడా కోహ్లికి విశ్రాంతినిచ్చారు’. ఇటువంటి సమయంలో కోహ్లీకి గంగూలీ మద్దతుగా నిలవటం హాట్ టాఫిక్‌గా మారింది.