ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం ‘జగనన్న తోడు’ పథకం కింద మూడో విడత చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మూడో విడత రుణాలను ఆయన జమ చేశారు. చిరు వ్యాపారులకు మరో 5,10,462 మందికి ప్రభుత్వం రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీకి శ్రీకారం చుట్టిందని తెలిపారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. “పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను దగ్గరుండి చూశా. చిరు వ్యాపారుల కష్టాలు నాకు తెలుసు. మీకూ మంచి చేయాలన్న ఆలోచనతోనే ఈ జగనన్న తోడు పథకాన్ని తీసుకువచ్చాం. చిరు వ్యాపారులు మీకూ మీరే ఉపాధి కల్పించుకోవడానికి ఇదొక మంచి అవకాశం. ఈ పథకం కింద లక్షలాది మంది చిరు వ్యాపారులు స్వయం ఉపాధి పొందుతున్నారు. ఈ పథకం ద్వారా మీ కళ్లమీద మీరే నిలబడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది” అని జగన్ పేర్కొన్నారు.
అంతేకాకుండా మొదటి విడతలో 5.35 లక్షల మంది, రెండో విడతలో 3.70 లక్షల మందికి ప్రభుత్వం రుణాలు అందించింది. మూడో విడతతో కలిపి మొత్తం 14.16 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుందని అన్నారు.