అమెరికా గగనతలంపై ప్రయాణించిన చైనా బెలూన్‌ను అగ్రరాజ్యం నిఘా వర్గాలు ఇటీవల కూల్చివేసిన సంగతి తెలిందే. కూల్చివేసిన ప్రదేశంలో సెన్సర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తించారు. అప్పటినుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అది వాతావరణ పరిశోధన కోసం ప్రయోగిస్తే అమెరికా కూల్చివేసిందని డ్రాగన్ కంట్రీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. అమెరికా మాత్రం చైనా బెలూన్ల వ్యవహారాన్ని సీరియస్‌గానే తీసుకుంటోంది.
తాజాగా ఇదే అంశంపై అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెలూన్ కూల్చిన ఘటనలో చైనాకు క్షమాపణలు చెప్పే ఉద్దేశం లేదన్నారు. తమ దేశ ప్రజల భద్రత, ప్రయోజనాలే తమకు ముఖ్యమని తేల్చి చెప్పారు. త్వరలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో మాట్లాడతానని తెలిపారు.అమెరికా సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధాన్ని కోరుకోవడం లేదని బైడెన్ వెల్లడించారు.
అమెరికా గగనతలంలో జనవరి 28న తొలిసారి ఈ బెలూన్‍ను గుర్తించారు. ఖండాంతర బల్లాస్టిస్ మిసైళ్లు ఉన్న మోంటానాలో ముందుగా ఈ బెలూన్‍ను కనిపెట్టింది. ఆ తర్వాత క్రమంగా అది ఉత్తర కరోలినాకు చేరుకుంది. అక్కడ ఆ బెలూన్‍ను అమెరికా కూల్చివేసింది.తమ బెలూన్‍ను అమెరికా కూల్చివేడయం పట్ల చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వాతావరణంపై రీసెర్చ్ చేసేందుకు దాన్ని పంపామని, అది సివిలియన్ ఎయిర్ షిప్ అని ప్రకటించింది. అనుకోకుండా అది దారి మార్చుకొని అమెరికా వైపునకు వెళ్లిందని చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.బెలూన్ కూల్చివేయడంపై తమ నుంచి కూడా సరైన ప్రతిస్పందన ఉంటుందని చైనా హెచ్చరించింది.