నేను, నా కుటుంబం బలైపోయేది: పొన్నాడ - MicTv.in - Telugu News
mictv telugu

నేను, నా కుటుంబం బలైపోయేది: పొన్నాడ

May 25, 2022

ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంలో కోనసీమ జిల్లా పేరు మార్పుపై మంగళవారం జరిగిన విధ్వంసంలో ఆందోళనకారులు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ ఇంటికి నిప్పు పెట్టి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పొన్నాడ సతీష్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ..”మా ఇంటి పైఅంతస్తులో నేను, నా కుటుంబ సభ్యులు ఉన్నాం. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఆందోళనకారులు నిప్పు పెట్టారు. బయటకు వచ్చేసరికి ఇల్లంతా మంటలతో కాలిపోతోంది. అప్పుడే పోలీసులు మరి ముఖ్యంగా డీఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపి, నన్ను, నా భార్యను, నా కుటుంబ సభ్యులను బయటకు తీసుకొచ్చి రక్షించారు. పోలీసులు రావటం క్షణం ఆలస్యం అయిన నేను, నా కుటుంబం ఆ మంటల్లో బలైపోయ్యేవాళ్లం. పెట్రోల్‌ డబ్బాలతో వచ్చి ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులు చేసి నిప్పు పెట్టారంటే ఎంతటి పక్కా ప్రణాళికతో వచ్చారో అర్థం అవుతోంది. బస్సులను ధ్వంసం చేసి, పోలీసులపై కర్కశంగా రాళ్లు రువ్వారు. ఇవన్నీ చూస్తుంటే ముందస్తు వ్యూహంతోనే దాడులకు0 దిగినట్టు స్పష్టమవుతోంది” అని ఆయన అన్నారు.

మరోపక్క అమలాపురంలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. కాకినాడ, రాజమండ్రి నుంచి కోనసీమ బస్సు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. అమలాపురంలో పూర్తి స్థాయిలో ఎక్కడ ధర్నాలు, ఆందోళన జరగకుండా పోలీసులు పహరా కాస్తున్నట్లు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతిపక్షాలపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ఆందోళనకు వారే కారణమంటూ ఆరోపణలు చేస్తున్నారు.