హైస్కూల్లో చదివే 8, 9, 10 వ తరగతి విద్యార్ధుల బ్యాగులను చెక్ చేసిన అధికారులకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. అందులో గర్భాన్ని నిరోధించే మెడిసిన్ ఐ పిల్స్, కండోమ్ ప్యాకెట్లు, సిగరెట్లు, వాటర్ బాటిల్ లో ఆల్కహాల్ వంటివి చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. సెల్ ఫోన్లతో చదువులు అటకెక్కుతున్నాయనే భావనతో పాఠశాలలోకి వాటిని నిషేధించింది అక్కడి విద్యాశాఖ. అయినా సరే ఎందుకైనా మంచిదని అకస్మాత్తుగా తనిఖీ చేయమని అధికారులతో పాటు ఉపాధ్యాయులను ఆదేశించింది.
ఎవరైనా దొంగచాటుగా ఫోన్ తెచ్చారేమోననే అనుమానంతో తనిఖీ చేసిన అధికారులకు పైన పేర్కొన్న వస్తువులు దొరకడంతో ఖిన్నులైపోయారు. ఓ విద్యార్ధిని బ్యాగులో కండోమ్ ప్యాకెట్లు దొరగ్గా, అమె ఆ నెపాన్ని మగ విద్యార్ధులపై నెట్టేయడానికి యత్నించింది. ఓ విద్యార్ధి బ్యాగులో ఐ పిల్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ లో లిక్కర్ దొరికిందని ఆ శాఖ ప్రధాన కార్యదర్శి డి. శశికుమార్ వెల్లడించారు. తనిఖీల అనంతరం ఆయా పాఠశాలల యాజమాన్యాలు హుటాహుటిన పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాయి. విద్యార్ధుల ప్రవర్తన గురించి ఫిర్యాదు చేసి వారిలో మార్పు తీసుకొచ్చేందుకు పది రోజుల సెలవు ప్రకటించాయి. ఈ ఆధునిక యుగంలో తల్లిదండ్రులే పిల్లలను సరైన దారిలో పెట్టాలని, కౌమార దశలో సంభవించే శారీరక మార్పులు, ఆకర్షణలు, కొత్త అనుభూతులకై ఆరాటం వంటి వాటిపై వారికి హితబోధ చేయాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.