వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలకు పోటీగా వారసుడు చిత్రం కోసం తెలుగు రాష్ట్రాల్లో గణనీయమైన సంఖ్యలో థియేటర్లను బ్లాక్ చేస్తున్నాడని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుపై ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. సంక్రాంతి లాంటి పండగ సీజన్ కి తెలుగు హీరోలకి అవకాశం లేకుండా డబ్బింగ్ చిత్రాన్ని రంగంలోకి దింపటం న్యాయం కాదని కామెంట్స్ వినిపించాయి. కానీ దిల్ రాజు ఎక్కడ వెనక్కి తగ్గలేదు. వారసుడు రిలీజ్ డేట్ ని అందరికంటే తానే మొదట ప్రకటించానని.. అసలు వారసుడు చిరంజీవి, బాలకృష్ణలకి పోటీ కాదని.. ఎట్టి పరిస్థితుల్లో జనవరి 12నే వారసుడుని రిలీజ్ చేస్తానని పట్టు పట్టారు దిల్ రాజు. దీంతో మెగా నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దిల్ రాజుపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. తెలుగు నిర్మాత అయి ఉండి తెలుగు హీరోలకి గౌరవం ఇవ్వకుండా ఏంటీ పనులు అంటూ మండిపడ్డారు. అయితే ఎక్కడ పట్టు వీడని దిల్ రాజు తాజాగా మాత్రం వెనక్కి తగ్గారు.
చిరంజీవి బాలకృష్ణ వంటి తెలుగు హీరోలకి పోటీ ఇవ్వొద్దని తన సినిమాని వాయిదా వేస్తున్నట్టు సంచలన ప్రకటన చేశాడు. జనవరి 11న వారిసు, తెగింపు రిలీజ్ అవుతుండగా.. జనవరి 12న వీరసింహారెడ్డి, 13న వాల్తేరు వీరయ్య రిలీజ్ కాబోతున్నాయి. కానీ.. నిన్నటివరకు వారిసు తెలుగు వెర్షన్ వారసుడు రిలీజ్ డేట్ 12న ఉండగా.. దాన్ని అనూహ్యంగా మారుస్తూ.. జనవరి 14న వారసుడు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు దిల్ రాజు. తాజాగా ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. ‘వారసుడు చిత్రం తమిళంలో జనవరి 11న రిలీజ్ అవుతుంది. కానీ.. తెలుగులో ఆల్రెడీ పెద్ద హీరోల సినిమాలు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు ఉండటంతో.. రెండు రోజులు ఆలస్యంగా జనవరి 14న రిలీజ్ చేస్తున్నాం. ఈ విషయంపై ఆల్రెడీ ఇండస్ట్రీలో పెద్దలతో డిస్కస్ చేశాం. దీంట్లో ఒక అడుగు వెనక్కి వేశాననే బాధ లేదు. వారసుడుపై నాకు 100 శాతం నమ్మకం ఉంది’ అంటూ దిల్ రాజు ప్రటించారు.