మంత్రి ధర్మాన రాజధాని అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అమరావతే ఏకైక రాజధాని అని అంటే తాను ప్రత్యేక విశాఖ రాష్ట్రం కోసం పోరాడుతానని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లాలోని పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్లో ఆయన సీసీ రోడ్డును ప్రారంభించి అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తే సహించబోనని స్పష్టం చేశారు. ఇవాళ ఓ కోటి రూపాయలతో రోడ్డు వేస్తే మీరెంతో ఆనందపడుతున్నారని, స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత ఇదా మన పరిస్థితి అని ప్రశ్నించారు. విభజన వల్ల నష్టపోయిన ఏపీకి కేంద్రం 23 సంస్థలు ఇస్తే అప్పుడు ఉన్నది 13 జిల్లాలే కాబట్టి జిల్లాకు కనీసం రెండు సంస్థలైనా రావాలి కదా? కానీ ఒక్కటైనా వచ్చిందా అని అడిగారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు దీనిపై నిలదీయలేదని, ప్రజల సమస్యలపై ప్రశ్నించలేని ప్రజా ప్రతినిధులు ఎందుకని దుయ్యబట్టారు. ‘ ఓ ఫిషింగ్ హార్బర్ లేదు, జెట్టీ లేదు. గ్రామాల్లో తాగడానికి మంచి నీరు లేదు. అభివృద్ధి విషయంలో అన్యాయం చేస్తే గొంతెత్తుతాను. అధికార పార్టీ అన్యాయం చేయాలని చూసినా ఉరుకోను’ అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు.