మనోహరాచారిని తన్నింది నేను కాదు మొర్రో… - MicTv.in - Telugu News
mictv telugu

మనోహరాచారిని తన్నింది నేను కాదు మొర్రో…

September 25, 2018

నగరంలోని ఎర్రగడ్డలో గోకుల్ థియేటర్ వద్ద కూతురు, అల్లుడిపై తండ్రి జరిపిన కత్తిదాడి ఘటన గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.  కూతురు మాధవి, అల్లుడిపై కొబ్బరి బొండాలు నరికే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన మనోహరాచారిని వెనుక నుంచి బలంగా తన్నిన వ్యక్తిని తాను కాదు మొర్రో అని అసద్‌ వెల్లడించాడు. సీసీటీవీలో కూతురు, అల్లుడిని నరుకుతున్నప్పుడు వెనకనుంచి వచ్చిన ఓ వ్యక్తి బలంగా తన్ని పక్కకు పరుగుతీశాడు. అతను అసదే అని, ఎర్రగడ్డ డివిజన్‌ జహరా గుల్హన్‌ నూర్‌‌బాగ్‌ బస్తీకి చెందినవాడని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అతని సాహసానికి చాలా మంది ముగ్దులయ్యారు. అసద్ తెగించకపోయి వుంటే ఇద్దరి ప్రాణాలు తీసేవాడని కామెంట్లు చేశారు.అతను తన్నడం వల్లే మనోహరాచారి పారిపోయాడని మెచ్చుకున్నారు. పత్రికల్లో కూడా అసద్ గురించి ప్రచురితం అయింది. కానీ ఇంత ప్రచారం జరిగి, బయటంతా అసదే వాళ్ళకు ప్రాణభిక్ష పెట్టాడు అనుకుంటుండగా… అతను అసద్ కాదు అనే నిజం తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఎస్‌ఆర్‌నగర్‌ సీఐ వెంకటేశ్వరరావు అసద్‌ను పిలిచి విచారించారు. ఆ వీడియోలో మనోహరాచారిని తన్నింది తాను కాదని చెప్పాడు అసద్. సోషల్ మీడియాలో తన ప్రమేయం లేకుండానే ప్రచారం జరుగుతోందని అసద్ స్పష్టం చేశాడు. మరి ఆ తన్నిన వ్యక్తి ఎవరు అన్నది ఇప్పుడు పోలీసులకు మిస్టరీగా మారింది. ఆ సాహస యువకుడిని గుర్తించేందుకు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. త్వరలోనే అతణ్ణి గుర్తిస్తామని ధీమా వ్యక్తం చేశారు.