తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గత శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి, 142 మందిని అదుపులోకి తీసుకున్న సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనాన్ని రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాడిలో భాగంగా పబ్‌లో డ్రగ్స్ వాడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడటంతో కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అయితే, అదుపులోకి తీసుకున్న వారిలో ఇప్పటికే రాహుల్ సిప్లిగంజ్, నిహారిక వంటి సెలబ్రిటీలు సహా పలువురు ప్రముఖల పిల్లలు పేర్లు బయటకు రావడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. దీంతో పోలీసుల దాడుల్లో పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారికి నోటీసులు కూడా ఇచ్చారు.
తాజాగా ఈ ఘటనలో తనపై జరుగుతున్న ప్రచారంపై షార్ట్ ఫిలిం నటి కల్లపు కుషితా స్పందించారు. ”అక్కడ అసలు డ్రగ్స్ వాడుతున్నారనే విషయమే నాకు తెలియదు. ఒకవేళ తెలిస్తే అసలు వెళ్లేవాళ్లం కాదు. నేను మందు తాగలేదు, డ్రగ్స్ తీసుకోలేదు. జస్ట్ పార్టీ చూద్దామని వెళ్లాను. కానీ, ఇంత ఇష్యూ అవుతుందనుకోలేదు. వీకెండ్లో మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి వెళ్లాను. నా ఫ్రెండ్ హర్ష సహా ఐదుగురం ఆ పబ్‌కి వెళ్లాం. కానీ హర్ష గతంలో డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నాడన్న విషయం నాకు తెలియదు. కావున ప్లీజ్ దయచేసి నాకు ఫ్యామిలీ ఉంది. ప్లీజ్ సోషల్ మీడియాలో నాపై ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేయకండి” అంటూ ఆమె వేడుకుంది. అయితే, పలువురు నెటిజన్లు ఆమెపై కోపంగా ఉన్నా, మరికొంతమంది మాత్రం తప్పు చేయలేదు అని ఆమె నిజాయితీగా ఒప్పుకుంటుంది కాబట్టి వదిలేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరోపక్క కల్లపు కుషితా పలు వీడియోల ద్వారా మాట్లాడుతూ.. ‘మా గ్రూప్‌లో అయితే ఎవరూ డ్రగ్స్ తీసుకోలేదు. ఎలాంటి శాంపిల్స్ తీసుకోవడానికైనా మేం రెడీ. నేను రెగ్యులర్‌గా పార్టీలకు వెళ్లను. నాకు షూటింగ్స్ ఉంటాయి. కానీ వీకెండ్ కావడంతో కర్మాగాలి వెళ్లాను. అంతకు మించి ఏం లేదు. ఇక ఈ ఇష్యూ గురించి ఇంట్లో కూడా బాగా గొడవ జరిగింది. మా పేరెంట్స్ నన్ను బాగా తిట్టారు. ఇంకోసారి ఇలాంటి పార్టీలకు వెళ్లను’ అంటూ చెప్పుకొచ్చింది.