రాబోయే సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తానని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు సంచలన ప్రకటన చేశారు. గత ఎన్నికల్లో వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించినా.. తనకింకా సర్వీసు ఉండడంతో కేసీఆర్ వారించారని తెలిపారు. ఈ సారి ఎన్నికలు వచ్చే నాటికి తన సర్వీసు పూర్తవుతుందనీ, అప్పుడు ఖచ్చితంగా ఎన్నికల బరిలో దిగుతానని స్పష్టం చేశారు. గురువారం నిజామాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కమిషనర్ పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. కాగా, కేఆర్ నాగరాజు 2021 డిసెంబర్లో నిజామాబాద్ రెండో పోలీస్ కమిషనర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు తెలుసుకొని వెంటనే తన బృందాలను పంపి పరిష్కరిస్తున్నారు. తన పరిధిలో గంజాయి సేవించే 300 మంది యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. గంజాయి పండించే రైతులకు ప్రభుత్వ పథకాలను నిలిపివేసే విధంగా తగిన చర్యలు చేపట్టారు. ఇక తదుపరి కార్యాచరణగా నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. కూడళ్ల వద్ద బిచ్చగాళ్లు, హిజ్రాల వేధింపులను కూడా అరికడతానని హామీ ఇచ్చారు.