నా తెలుగు పరిశ్రమను విడిచిపెట్టను: మహేశ్ బాబు - MicTv.in - Telugu News
mictv telugu

నా తెలుగు పరిశ్రమను విడిచిపెట్టను: మహేశ్ బాబు

May 10, 2022

టాలీవుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు బాలీవుడ్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా తెలుగు సినిమా పరిశ్రమను విడిచిపెట్టి, బాలీవుడ్‌లో నటించే ఆలోచనే లేదు’ అని ఆయన తేల్చి చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేశ్ బాబు మాట్లాడుతూ.. ‘‘హిందీ పరిశ్రమ నుంచి నాకు ఎక్కువ ఆఫర్లు రాలేదు. నన్ను వారు భరిస్తారని నేను అనుకోవడం లేదు. నన్ను భరించలేని పరిశ్రమలో పని చేయడం టైం వెస్ట్. తెలుగు పరిశ్రమలో నాకు వచ్చిన గుర్తింపు, గౌరవం, స్టార్‌డమ్ పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే, నా తెలుగు పరిశ్రమను విడిచిపెట్టే ఆలోచన చేయను, విడిచిపెట్టను. మరిన్ని సినిమాలు చేసి, మరింత ఎత్తుకు ఎదగాలనే ఎప్పుడూ ఆలోచిస్తుంటాను. నా కల ఇప్పుడు నెరవేరుతోంది’’అని ఆయన అన్నారు.

మరోపక్క మహేశ్ బాబు తాజాగా నటించిన ‘సర్కారు వారి పాట’ ఈనెల 12న విడుదల కానున్న విషయం తెలిసిందే. రెండేళ్ల తర్వాత ఆయన కొత్త సినిమా విడుదల అవుతున్న సందర్భంగా మహేశ్ బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ‘సర్కారు వారి పాట’ ఓ రేంజ్‌లో ఉంటుందని, సినిమాను వీక్షించటం కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ యాంకర్ ‘బాలీవుడ్‌‌లో మహేశ్ బాబుకి ఆఫర్లు వస్తే, వెళతారా?’ అని అడిగిన ప్రశ్నకు ఆయన క్లారిటి ఇచ్చారు.