నటి కల్పికా గణేష్.. నటన కంటే వివాదాస్పద వ్యాఖ్యలతోనే పాపులర్ అయిన కొద్దిమందిలో ఒకరు. యశోద సినిమాలో నటించిన ఈమె.. ఇటీవల తమిళ దర్శకుడు బాలాజీ మోహన్, నటి ధన్యల రిలేషన్ ని రివీల్ చేసింది. దీంతో వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా వివాదం నడవగా, తన వీడియోను యూట్యూబ్ నుంచి డిలీట్ చేయించడంపై కల్పిక మండిపడిన విషయం తెలిసిందే. అలాంటిది నటి కల్పిక ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్ కి వెళ్లింది. తనకు ఆహ్వానం లేకపోయినా వెళ్లి ఏకంగా స్టేజ్ ఎక్కి మాట్లాడింది. ‘పిలవని పేరంటానికి వచ్చాను. నన్నెవరూ పిలవలేదు. కానీ పరిశ్రమను ఇల్లుగా భావిస్తాను.
అందుకే మొహమాటం లేకుండా వచ్చేశాను. జనాలకు నిజాలేంటో తెలియాలనే సెలబ్రిటీల నిజ స్వరూపాలను బయటపెడుతున్నాను. సుచీలీక్స్ ఊరికే బయటకి రాలేదు. చిన్మయి ఎంతో ఫైట్ చేసింది కానీ ఆమెను మూసేశారు. ధనుష్, ధన్య, బాలాజీ మోహన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.. ఇలా కొందరు వ్యక్తుల నిజాలు బయటికి రావాలి. కొత్త సంవత్సరంలో చాలా మంది బండారాలు బయటపెడతా. ఇక ట్రోల్స్ అంటారా? చేసేవాళ్లు చేస్తూ ఉంటారు.
నేనస్సలు పట్టించుకోను’ అంటూ డేరింగ్ గా మాట్లాడడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. కాగా, బాలాజీ మోహన్ – ధన్యల ఎపిసోడ్ తెలిసిందే. ఇక ధనుష్, అనిరుధ్ లు యువనటీమణులతో ఎంజాయ్ చేయగా, ఆ ఫోటోలు బయటకి రావడం కొన్నేళ్ల క్రితం దుమారం రేపింది. దీనిపైనే ధనుష్ నుంచి భార్య విడాకులు తీసుకున్నారని టాక్ వచ్చింది. ఇవి తెలిసినవే కాబట్టి కల్పిక మాత్రం ఇంకా లోతుగా వీరి గురించి చెప్పనుందని సమాచారం.