హ్యాపీ రిపబ్లిక్ డే.. ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్
దేశ వ్యాప్తంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుగుతున్నాయి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26, 1950 నుండి దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశవాసులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల కలలు నిజమవ్వాలంటే ఉమ్మడిగా ముందుకుసాగాలని దేశవాసులకు సందేశమిచ్చారు. ఈ మేరకు ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.
‘‘ భారతీయులు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ సమయంలో జరుపుకుంటున్న ఈ గణతంత్ర దినోత్సవం విశిష్టమైనది. దేశం కోసం అసువులుబాసిన స్వాతంత్ర్య సమరయోధుల కలలు నిజం కావాలంటే ఉమ్మడిగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ఈ మేరకు హిందీలో ఆయన ట్వీట్ చేశారు.
गणतंत्र दिवस की ढेर सारी शुभकामनाएं। इस बार का यह अवसर इसलिए भी विशेष है, क्योंकि इसे हम आजादी के अमृत महोत्सव के दौरान मना रहे हैं। देश के महान स्वतंत्रता सेनानियों के सपनों को साकार करने के लिए हम एकजुट होकर आगे बढ़ें, यही कामना है।
Happy Republic Day to all fellow Indians!
— Narendra Modi (@narendramodi) January 26, 2023
మరోవైపు, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీ నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 6,000 మంది భద్రతా సిబ్బంది, 24 హెల్ప్ డెస్కులతో రద్దీ ప్రాంతాల్లో తనిఖీలను విస్తృతం చేశారు. 60 వేల మందికి పైగా ప్రజలు ఈ వేడుకలకు తరలివస్తారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది సందర్శకుల పాసులకు క్యూఆర్ కోడ్ కేటాయించారు. 150కు పైగా సీసీ టీవీ కెమెరాలను అమర్చారు. ఎన్‌ఎస్జీ, డీఆర్డీవోలకు చెందిన యాంటీ డ్రోన్ బృందాలను నియమించారు.
ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు ఎల్-సిసి హాజరవుతున్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు ఈజిప్టు నేత హాజరుకావడం ఇదే తొలిసారి. కర్తవ్య పథ్‌లో వేడుకలు ముగిసిన తర్వాత సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఎట్ హోమ్ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొంటారు. మరోవైపు, పరేడ్‌లో భాగంగా అర్జున్ ట్యాంకులు, నాగ్ మిసైల్ వ్యవస్థలు, కే-9 వజ్ర ట్యాంకులను ప్రదర్శించనున్నారు.