కుక్కతో వాకింగ్ కోసం స్టేడియాన్ని ఖాళీ చేయించిన ఐఏఎస్ - MicTv.in - Telugu News
mictv telugu

కుక్కతో వాకింగ్ కోసం స్టేడియాన్ని ఖాళీ చేయించిన ఐఏఎస్

May 26, 2022

పెంపుడు కుక్కతో వాకింగ్ చేయడం కోసం ఓ ఐఏఎస్ అధికారి ఏకంగా స్టేడియాన్నే ఖాళీ చేయించాడు. అప్పటివరకు గ్రౌండులో ఆడుతున్న క్రీడాకారులను బయటికి పంపించేసి రన్నింగ్ ట్రాక్ మీద కుక్కతో వాకింగ్ చేస్తున్నాడు. బాధ్యతగా మసలుకోవాల్సిన ఉన్నతాధికారి దేశ రాజధానిలో చేసిన నిర్వాకం ఇది. వివరాలు.. త్యాగరాజ్ స్టేడియంలో సాధారణంగా రాత్రి 7 గంటల వరకు క్రీడాకారులు తమ ప్రాక్టీస్ చేస్తుంటరారు. కోచ్‌లు కూడా వారితోపాటే ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా రాత్రి 7 గంటలకు ముందే అధికారులు వచ్చి గ్రౌండుని ఖాళీ చేయిస్తున్నారు. ఖాళీ అయిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి కుక్కతో వాకింగ్ చేసుకుంటున్నాడు. కొన్ని నెలలుగా ఇలా జరుగుతుండడంతో మీడియా వాళ్ల దృష్టికి ఈ విషయం వెళ్లింది. దీంతో వరుసగా కథనాలు ప్రసారం కావడంతో ఆ ఆఫీసర్‌పై విమర్శలు వచ్చాయి. వీళ్లు ఢిల్లీలోనే ఇలా ఉన్నారంటే జిల్లా కేంద్రాల్లో, ఇతర పట్టణాల్లో వీళ్లు రాజుల్లా భావిస్తారేమో? అని నెటిజన్లు కామెంట్ చేశారు. దాంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అధికారి తీరును తప్పుబడుతూ.. ఏ స్టేడియమైనా రాత్రి పది గంటల వరకు క్రీడాకారులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కాగా, ఐఏఎస్ ఆఫీసర్‌ తన తప్పు ఒప్పుకున్నారు.