IAS officer enrols son in Andhra government school, says change is in air
mictv telugu

ఐఏఎస్ కొడుకు సర్కార్ బడికి..

July 26, 2022

తన కుమారుణ్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నలుగురికీ ఆదర్శంగా నిలిచారు ఏపీ ఐఏఎస్‌ ఆఫీసర్‌ బి.నవ్య. తాను కూడా గవర్నమెంట్‌ ఎయిడెడ్‌ స్కూల్లోనే చదువుకొని ఐఏఎస్‌ అధికారిణి అయ్యానని గుర్తు చేసుకున్నారు. నవ్య శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్మెంట్‌ ఏజెన్సీ (ఐటీడీఏ) ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌(పీవో)గా పనిచేస్తున్నారు. ఆమె కుమారుడు బి.శ్రీకర్‌ ప్రతిక్‌ ఆరో తరగతి చదువుతున్నాడు. అతణ్ని నవ్య.. మల్లి ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్లో చేర్పించారు.

ఈ సందర్భంగా నవ్య మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం విద్యా రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవటానికి కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయని అన్నారు. గవర్నమెంట్‌ బడులు ప్రైవేట్‌ స్కూల్స్‌కి ఏమాత్రం తీసిపోవని పేర్కొన్నారు. నాడు-నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, అన్ని చోట్లా ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టారని వెల్లడించారు. సీతంపేట మండలంలో ప్రైవేట్‌ స్కూల్స్‌ లేవని, 40 కిలో మీటర్ల దూరంలోని పాలకొండ మండలంలో ఉన్నాయని నవ్య చెప్పారు.

నిత్యం 40 కిలోమీటర్లు వెళ్లటం, రావటం ఇబ్బందని, అందుకే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించానని ఆమె వివరించారు. పిల్లల్ని ప్రైవేట్‌ స్కూల్స్‌లో జాయిన్‌ చేయించేందుకు మధ్య తరగతి కుటుంబాల పేరెంట్స్‌ సైతం పోటీపడుతున్న ఈ రోజుల్లో ఐఏఎస్‌ ఆఫీసర్‌ తన కుమారుణ్ని సర్కారు బడిలో జాయిన్‌ చేయించటం నిజంగా అధినందించదగ్గ విషయమని పలువురు ప్రశంసిస్తున్నారు.