IAS officer Jitendra Narain has been suspended by the Centre
mictv telugu

రేపిస్ట్ ఐఏఎస్‌ను సస్పెండ్ చేసిన కేంద్రం

October 18, 2022

IAS officer Jitendra Narain has been suspended by the Centre

ఐఏఎస్ స్థాయిలో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన ఉన్నతాధికారి ఉద్యోగం పేరుతో యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. యువతి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కేంద్రం.. ఆరోపణలు నిజమని తేలడంతో సదరు అధికారిని సస్పెండ్ చేసింది. 1990 బ్యాచుకు చెందిన జితేంద్ర నరైన్ ఇటీవల కాలం వరకు అండమాన్ నికోబార్ దీవులకు చీఫ్ సెక్రటరీగా పని చేశారు.

ఆ సమయంలో ఓ యువతికి (21) ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి తనవద్దకు రప్పించుకున్నాడు. బలవంతంగా మద్యం తాగించి అపస్మారక స్థితికి చేరుకున్నాక రెండుసార్లు అత్యాచారం చేశాడు. తర్వాత మరో వ్యక్తి కూడా ఘాతుకానికి ఒడిగట్టాడు. దీంతో యువతి ఆగస్టు నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాక్ష్యంగా జితేంద్ర ఆఫీసు వద్ద సీసీ కెమెరాలు పరిశీలించాలని, అతని ఆఫీసులోని సిబ్బందిని కూడా గుర్తు పట్టగలనని పేర్కొంది. అంతేకాక, తన పేరు బయటపెట్టిన జర్నలిస్టుపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో వివరించింది. దీనిపై స్పందించిన కేంద్రం.. పోలీసు విచారణతో పాటు ప్రత్యేక కమిటీని వేసింది. నివేదికలో యువతి ఆరోపణలు నిజమని తేలడంతో ప్రస్తుతం ఢిల్లీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ చైర్మెన్ అండ్ ఎండీగా ఉన్న జితేంద్ర నరైన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.