డెలివరీ అయిన 15 రోజులకే విధుల్లోకి.. సలాం తల్లీ! - MicTv.in - Telugu News
mictv telugu

డెలివరీ అయిన 15 రోజులకే విధుల్లోకి.. సలాం తల్లీ!

October 13, 2020

IAS Officer Rejoins Work 14 Days After Delivery

భారత్‌లో ఉద్యోగం చేస్తున్న మహిళలు గర్భం దాల్చితే 26 వారాల సెలవు తీసుకోవచ్చు. పెద్ద కొలువుల్లో ఉన్నవారు ఎక్కువ రోజులు తీసుకున్నా అడిగేవారు ఉండరు. అలాంటిది ఓ ఐఏఎస్ అధికారి బిడ్డకి జన్మనిచ్చిన 15రోజులకే విధుల్లో చేరింది. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఉన్న మోదీనగర్‌ సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్ సౌమ్య పాండే. ఆమె సెప్టెంబర్‌ 17న ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. 15రోజులకే తిరిగి విధులకు హాజరైంది. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా తన 24రోజుల కుమార్తెతో కలిసి ఫైల్స్‌ చూసింది. దీని గురించి ఆమె స్పందిస్తూ..’కుటుంబంతో పాటు దేశ సేవ కూడా ముఖ్యమైందని నేను నమ్ముతాను. పనిని ఎంతో ముఖ్యమైందిగా భావిస్తాను. జపాన్‌ లాంటి దేశాల్లో మహిళలు ప్రసవించిన తర్వాత తమ పనిని వదిలేస్తారు. అలాకాకుండా ఆరోగ్యం బాగుంటే తిరిగి పనిలోకి వస్తే ఎలాంటి సమస్యలూ ఉండవు.’ అని తెలిపారు. 

సౌమ్య పాండే మోతీలాల్‌ నెహ్రూ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో బిటెక్‌లో పట్టా పొందారు. బీటెక్‌లో ఆమె గోల్డ్ మెడల్ సాధించారు. ఆ తరువాత మొదటి ప్రయత్నంలోనే యూపిఏస్సి పరీక్షలో టాప్ టెన్ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌ అధికారి అయ్యారు. మోదీనగర్‌లో సంవత్సరం క్రితం డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె పాపను పట్టుకుని ఫైల్స్ చూస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలవు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ విధులకు హాజరవుతున్న ఆ అధికారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఒక్క చర్యతో ఎందరో ప్రభుత్వ అధికార్లకు ఆదర్శంగా నిలిచారని కొనియాడుతున్నారు.