తెలంగాణలో సమర్ధులు లేరనుకుంటే ఏపీని ఒప్పించి తీసుకోండి : కేంద్రం
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తనకు కేటాయించిన ఏపీ కేడర్‌కు వెళ్లాల్సిందేనని కేంద్రం గురువారం స్పష్టం చేసింది. ఒకవేళ ఆయనంత సమర్ధులు లేరని తెలంగాణ భావిస్తే ఏపీని ఒప్పించి డిప్యుటేషన్ మీద తీసుకోవచ్చని పేర్కొంది. రాష్ట్ర విభజన సందర్భంగా తనను ఏపీకి కేటాయించడంపై సోమేశ్ కుమార్ క్యాట్‌లో సవాల్ చేశారు. క్యాట్ ఉత్తర్వులతో ఇప్పటివరకు తెలంగాణలో కొనసాగుతున్నారు. తర్వాత క్యాట్ ఉత్తర్వులను కేంద్రం తెలంగాణ హైకోర్టులో సవాలు చేయడంతో గురువారం విచారణ జరిగింది. కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ టి. సూర్యకిరణ్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ‘సివిల్స్ అధికారుల కేటాయింపు, బదిలీలు పూర్తిగా కేంద్రం ఆధ్వర్యంలో ఉంటాయి. ఈ విషయాన్ని క్యాట్‌లో విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఇప్పుడు హైకోర్టు ఎదుట తన వైఖరి మార్చుకుంది. రిజర్వుడ్ కేటగిరీకి చెందిన అధికారులు తక్కువ ఉన్నందున వారికి రోస్టర్ వైజ్ స్వాపింగ్ ఇచ్చాం. అన్ రిజర్వుడ్ అధికారులు ఎక్కువ ఉన్నందున వారికి బ్యాచ్ వైజ్ స్వాపింగ్‌కు అవకాశం ఇచ్చాం. సోమేశ్ అన్ రిజర్వుడ్ కేటగిరీకి చెందిన వారు కావడంతో బ్యాచ్ వైజ్ స్వాపింగ్‌లో భాగంగా ఏపీకి వెళ్లాల్సిందే’నని కోర్టుకు విన్నవించారు. కాగా, వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. అదే సమయంలో మిగతా అధికారుల పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉంది.