దాయాదుల ఫైట్ మళ్లీ చూడబోతున్నామా..చాంపియన్స్ ట్రోపి ఫైనల్ లో భారత్ -పాక్ ఢీ కొంటాయా…డూ ఆర్ డై మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి పాక్ ను సెమీస్ కు చేర్చిన సర్ఫరాజ్సేన..ఇంగ్లాండ్ కు ఇంటికి పంపించబోతుందా…మరో సెమీ ఫైనల్ మ్యాచ్ లో కూన బంగ్లాను డిఫెండింగ్ చాంపియన్ భారత్ మట్టికరించబోతుందా..?
చావో రేవో అన్న మ్యాచ్‌లో ఒకానొక సమయంలో శ్రీలంక గెలుస్తుందని అభిమానులు భావించారు. కానీ ఆ జట్టు ఫీల్డింగ్ తలకిందులు. చేజేతులా క్యాచ్ లు వదిలేయడం లో పాక్ అనూహ్యంగా పుంజుకుని సెమీస్‌కి దూసుకెళ్లింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. పాక్ బ్యాట్స్మెన్లు గెలుపు వరకు పోరాడారు. ఓ దశలో 167 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పాక్..సర్ఫరాజ్ అహ్మద్(61 నాటౌట్: 79 బంతుల్లో 5×4) అర్ధశతకానికి తోడుగా మహ్మద్ ఆమీర్(28 నాటౌట్: 43 బంతుల్లో 1×4) రాణించడంతో పాక్ 44.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరింది. పాక్ బ్యాట్స్మెన్లలో ఫకర్ జమాన్(50: 36 బంతుల్లో 8×4, 1×6) బ్యాటింగ్ మెరుపులు సృష్టించగా, అజార్ అలీ(34: 50బంతుల్లో 2×4, 1×6) అదిరిపోయేలా ఆడాడు.
పేలవ ఫీల్డింగ్ కారణంగానే పాక్ చేతిలో శ్రీలంక ఓడిపోయింది. మ్యాచ్ గెలిచేందుకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. పాక్ విజయంలో కీలక పాత్ర పోషించిన సర్ఫరాజ్ అహ్మద్ 38 పరుగుల దగ్గర ఇచ్చిన క్యాచ్‌ని పెరీరా వదిలేశాడు. ఆ తర్వాత 40 పరుగుల వద్ద మరోసారి ఇచ్చిన క్యాచ్‌ని సీకుగె చేజార్చాడు. దీనికి తోడు ఫీల్డింగ్‌లో అనవసర తప్పిదాల కారణంగా మ్యాచ్‌ను చేజేతులా శ్రీలంక పాక్‌కు అప్పగించింది. లంకపై విజయంతో సెమీస్ చేరిన పాక్ ఈ నెల 14న తొలి సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనుంది.
ఇక 15న రెండో సెమీ ఫైనల్ లో బంగ్లాదేశ్ తో భారత్ ఢీ కొంటుంది. ఈ మ్యాచ్ లో భారత్ కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత్ గెలిస్తే గ్రూప్ ఎ నుంచి ఫైనల్ కు వెళ్తోంది. అటు ఇంగ్లాండ్ ను పాక్ ఓడిస్తే గ్రూప్ బి నుంచి పైనల్ కు వస్తుంది. ఇలా జరిగితే చాంపియన్ ట్రోపి ఫైనల్ లో దాయాది ఫైట్ ను మళ్లీ చూడొచ్చు..ఇంగ్లండ్ వేదికగా 18న జరుగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ పై ఆసక్తి రేపుతోంది.