సూపర్ ఓవర్‌పై ఐసీసీ కీలక నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

సూపర్ ఓవర్‌పై ఐసీసీ కీలక నిర్ణయం

October 15, 2019

క్రికెట్ నిబంధనల్లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొన్ని మార్పులను చేపట్టింది. ఇప్పటి వరకు వరల్డ్ కప్‌లో కొనసాగుతూ వస్తున్న సూపర్ ఓవర్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి సూపర్ ఓవర్ డ్రాగా మారితే.. ఆ ఓవర్‌లో బౌండరీల ఆధారంగా విజేతను ప్రకటించబోమని స్పష్టం చేసింది. కౌన్సిల్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం  తీసుకున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేశారు. సూపర్ ఓవర్ ద్వారా స్పష్టమైన విజేత తేలేవరకు ఆట ఆడిస్తామని ఐసీసీ వెల్లడించింది. 

Super Over.

ఇప్పటి వరకు సూపర్‌ఓవర్‌ టైగా మారితే బౌండరీలు అత్యధికంగా బాదిన జట్టును విజేతగా ప్రకటించేవారు. దాని ఆధారంగా విజేతను ప్రకటించే అంశంపై తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది.ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన వరల్డ్ కప్‌ ఫైనల్‌లో ఇరుజట్లను సూపర్‌ ఓవర్‌ ఆడించారు. దాంట్లో కూడా రెండు టీంలు సమానమైన స్కోర్ చేడంతో చివరికి బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్‌కు కప్ దక్కింది.

కానీ ఇక్కడ రెండు జట్లు సమానమైన స్కోర్ చేసినప్పుడు బౌండరీలను లెక్కించడం సరికాదని పలువురు ఆక్షేపించారు. మాజీ క్రికెటర్లు కూడా దీన్ని తప్పుబట్టారు. దీంతో సూపర్ ఓవర్ అంశంపై భారత మాజీ బౌలర్ అనిల్ కుంబ్లే నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. దాని సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.