ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోపీని టీం ఇండియా దక్కించుకుంది. ఆస్ట్రేలియాపై 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. మొదటి రెండు టెస్ట్‌ల్లో భారత్ విజయం సాధిస్తే..మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా సత్తా చాటింది.నాలుగో టెస్ట్ మాత్రం డ్రాగా ముగిసినా…మూడు మ్యాచ్‌లకు భిన్నంగా సాగింది. బ్యాటర్లు పరుగుల వరద పారించారు.
ముఖ్యంగా రన్ మిషన్ విరాట్ కోహ్లీ భారీ సెంచరీ నమోదు చేసుకున్నాడు.16 నెలల తర్వాత సుదీర్ఘఫార్మెట్‌లో మూడెంకల స్కోరును నమోదు చేశాడు. ఈ క్రమంలోనే ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ముందుకు దూసుకొచ్చాడు. ఆసీస్‌తో నాలుగో టెస్టులో సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ ఏకంగా 705 పాయింట్లతో ఎనిమిది స్థానాలను మెరుగు పర్చుకుని 13వ స్థానంలో నిలిచాడు.
భారత్ తరఫున టాప్ 10 లో గాయం కారణంగా ఆటకు దూరమైన రిషభ్ పంత్, రోహిత్ తొమ్మది, పది స్థానాల్లో ఉన్నారు. ఆస్ట్రేలియా ఆటగాడు లబూషేన్ ప్రస్తుతం టెస్ట్‌ల్లో నెం.1 ఆటగాడిగా కొనసాగుతన్నాడు.
అశ్విన్ నెం.1
ఆస్ట్రేలియా సిరీస్‌లో అద్భతంగా రాణించిన టీం ఇండియా స్పిన్నర్ అశ్విన్ 24 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను సొంతం చేసుకున్నాడు. తద్వారా ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇప్పటివరకు జేమ్స్ అండర్స్‌న్‌తో నెం.1 స్థానాన్ని కలిసి పంచుకున్న అశ్విన్.. ప్రస్తుతం 10 పాయింట్లు ఎగబాకి టాప్‌లో కొనసాగుతున్నాడు.
టీం ఇండియా తరఫున బుమ్రా 7, జడేజా 9వ స్థానంలో ఉన్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో తొలి రెండు స్థానాలను రవీంద్ర జడేజా, అశ్విన్ దక్కించుకోవడం విశేషం. అక్షర్ పటేల్ 4వ ర్యాంక్‌లో ఉన్నాడు.