ఫైనల్ మ్యాచ్ కోసం రూల్స్ సవరించిన ఐసీసీ - MicTv.in - Telugu News
mictv telugu

ఫైనల్ మ్యాచ్ కోసం రూల్స్ సవరించిన ఐసీసీ

November 12, 2022

ఆస్ట్రేలియాలో నెల రోజులుగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ – పాకిస్తాన్ జట్లు కప్పుకోసం తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచుకి వర్షం ముప్పు పొంచి ఉంది. ఆదివారం వర్షం పడే సూచనలు 85 శాతం ఉన్నాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. దీంతో ఆదివారం మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే నాకౌట్ మ్యాచుల్లాగే రిజర్వ్ డే ఉంటుంది. అంటే ఆదివారం మ్యాచ్ సాగకపోతే సోమవారం నిర్వహిస్తారు.

ఒకవేళ సోమవారం కూడా వర్షం పడితే అప్పుడు ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో సంయుక్త విజేతలుగా ప్రకటించే పరిస్థితి రాకూడదని భావించిన ఐసీసీ.. ప్రత్యేకంగా ఈ మ్యాచ్ కోసం నిబంధనలను సవరించింది. రిజర్వ్ డే అయిన సోమవారం కూడా వర్షం పడితే మరో రెండు గంటలు వేచి చూసి, కనీసం పది ఓవర్ల పాటు మ్యాచ్ జరిగేలా చూడాలని మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌‌కి ఉత్తర్వులు పంపింది. ఆ దిశగా ప్రణాళిక రచించాలని ఆదేశించింది. సంయుక్త విజేతలు అనేది చివరి ఆప్షన్‌‌గా మాత్రమే చూడాలని, సాధ్యమైనంత వరకు మ్యాచ్ జరిగేలా చూడడమే తమ ఉద్దేశమని టోర్నీ నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఈ నిబంధన కేవలం ఈ మ్యాచుకే వర్తిస్తుందని స్పష్టం చేసింది.