మూడు ఫార్మాట్లలో భారత్ నెం.1 స్థానం దక్కించుకుందన్న అభిమానుల ఆనందం గంటల్లోనే ఆవిరైపోయింది. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానంలో ఉందని ప్రకటించిన కాసేపటికే భారత్‌ది నెం.2 స్థానం అంటూ ఐసీసీ కొత్త ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. తమ రేటింగ్ లెక్కల్లో తప్పులు కారణంగానే ఇలా జరిగిందిని వెల్లడించింది. ఐసీసీ సరిచేసి విడుదల చేసిన లెక్కలు ప్రకారం ఆస్ట్రేలియా 126 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, ఇండియా 115 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
బుధవారం మధ్యాహ్నం ఐసీసీ విడుదల చేసిన పాయింట్ల ప్రకారం భారత్ మొదటి స్థానం దక్కించుకుంది. ఆస్ట్రేలియా రెండవ ర్యాంక్‌లో ఉంది. ఇప్పటికే వన్డే, టీ20 స్థానాల్లో భారత్ నెం.1 ర్యాంక్‌లో కొనసాగుతుండగా తాజాగా టెస్ట్‌లో కూడా నెం. 1 స్థానం దక్కించుకోవడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఏకకాలంలో మూడు ఫార్మాట్లలో మొదటిసారి మొదటి స్థానంలో కొనసాగి రికార్డు సృష్టించిందని భావించారు. అయితే బుధవారం సాయింత్రం మరోసారి టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసిన ఐసీసీ భారత్ రెండో ర్యాంక్‌లో ఉందని ప్రకటించింది. తమ రేటింగ్ పాయింట్ల లెక్కల్లో తప్పిదంతో ఈ గందరగోళం చోటు చేసుకుందని ఐసీసీ వివరణ ఇచ్చింది. దాంతో భారత్ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్లో పడిపోయారు. లెక్కల్లో ఎలా పొరపాటు చేసారంటూ ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.