ఇరాన్ దేశంలో రెండు ఐస్‌క్రీం యాడ్లు పెను వివాదం రేపాయి. ఆ యాడ్‌ల్లో హిజాబ్‌ను నిర్లక్ష్యం చేశారని, మహిళలను అభ్యంతరకరంగా చూయించారని అక్కడి మత పెద్దలు తీవ్రస్థాయిలో మండిపడుతూ, మహిళలపై చర్యలు తీసుకోవాలని ధర్నాలు చేశారు. దాంతో అక్కడి దేశ సాంస్కృతిక శాఖ..ఇకపై ఎలాంటి ప్రకటనల్లో మహిళలు నటించకూడదని నిషేధం విధిస్తూ, ఉత్తర్వులను జారీ చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ”ఇరాన్ దేశంలో కొంతమంది మహిళలతో తాజాగా రెండు ఐస్‌క్రీం యాడ్లను విడుదల చేశారు. ఆ యాడ్‌ల్లో మహిళలు ఐస్‌క్రీం తింటున్నట్లుగా చిత్రీకరించారు. అయితే, అందులో హిజాబ్‌ను నిర్లక్ష్యం చేశారని, మహిళలను అభ్యంతరకర రీతిలో చూపెట్టారని ఇరాన్ మత పెద్దలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనలు మహిళా విలువలను అవమానించేవిగా, గౌరవ మర్యాదలను మంటగలిపేవిగా ఉన్నాయని ఆరోపించారు. సంబంధిత ఐస్‌క్రీం తయారీ సంస్థ డొమినోపై, ఆ యాడ్‌లో నటించిన మహిళలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
అంతేకాదు, ఆ దేశంలోని అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలకు లేఖ రాశారు. దీంతో స్పందించిన సాంస్కృతిక శాఖ.. హిజాబ్ పవిత్రత నియమాలను ఉల్లఘించారని పేర్కొంటూ, ఇకపై ఎటువంటి ప్రకటనల్లో మహిళలు నటించకూడదని ఆదేశాలు విడుదల చేశారు. సుప్రీం కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రెవల్యూషన్ తీర్పులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ దేశపు అధకారులు పేర్కొన్నారు.