ఐజ, కొల్లాపూర్ ఫార్వర్డ్ బ్లాక్ ఖాతాలోకి.. ఎక్కడిదీ పార్టీ?  - MicTv.in - Telugu News
mictv telugu

ఐజ, కొల్లాపూర్ ఫార్వర్డ్ బ్లాక్ ఖాతాలోకి.. ఎక్కడిదీ పార్టీ? 

January 25, 2020

ieeja municipality all indian forward block party win

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ హవా వీచింది. వందకుపైగా మునిసిపాలిటీలు కారు ఖాతాలో పడ్డాయి. అయితే కొన్నిచోట్ల అనూహ్య ఫలితాలు నమోదయ్యాయి. ఏమాత్రం సత్తా చూపలేని భావించిన అభ్యర్థులు విజయకేతనం ఎగరేశారు. కొన్ని చోట్ల స్వతంత్రులే అద్భుత ఫలితాలు సాధించారు. జగదాంబ గద్వాల్ జిల్లాలోని ఐజ మునిసిపాలిటీలోపాటు కొల్లాపూర్‌లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు. 

ఐజలోని 20 వార్డులకుగాను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి 10, టీఆర్ఎస్‌కు 6, కాంగ్రెస్‌కు 4 స్థానాలు దక్కాయి. మాజీ మంత్రి జూపల్లి వర్గానికి చెందిన వారు ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ పడ్డారు. కొల్లాపూర్ మునిసిపాలిటీలో జూపల్లి కృష్ణారావు వర్గానికే మెజారిటీ స్థానాలు దక్కడం విశేషం. కొల్లాపూర్‌లోని 20 స్థానాలో ఆయన వర్గానికి చెందిన వారు 15 మంది గెలిచారు. తన వర్గం వారికి టీఆర్ఎస్ టికెట్లు ఇవ్వకపోవడంతో జూపల్లి వారిని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి సింహం గుర్తుపై పోటీ చేయించారు. 

ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి పశ్చిమ బెంగాల్‌లో తప్ప మరెక్కడా ఉనికి లేదు. దేశానికి స్వతంత్ర రాకముందే కాంగ్రెస్ నుంచి విడిపోయిన సుభాష్ చంద్రబోస్ వర్గం ఈ పార్టీని స్థాపించింది. స్వతంత్రం వచ్చాక పార్టీ ముక్కలైంది. ప్రస్తుతం ఆ పార్టీ చిన్నాచితకా కమ్యూనిస్టు పార్టీలతో కలసి పోటీ చేస్తుంటుంది. పశ్చిమ బెంగాల్ లో దీనికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుంచి పోటీ చేసిన కోరుకంటి చందర్ తర్వాత గులాబీ కారు ఎక్కడం తెలిసిందే.