తెలంగాణలోనే కాదు, అటు ఏపీలోనూ, ఇటు ఢిల్లీ రాజకీయాల్లోనూ ఒకటే చర్చ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ, లేకపోతే ఈడీ అరెస్ట్ చేస్తుందా? లేదా? ఈ రెండు సంస్థలు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో పలువురు నిందితులకు నోటీసులు ఇచ్చి, సోదాలు చేసి అరెస్ట్ చేసిన నేపథ్యంలో నోటీసులు అందుకున్న కవితను కూడా రేపోమాపో అరెస్ట్ చేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. తనకు దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టుకోవడానికే ఆమె ‘మహిళా రిజర్వషన్ బిల్లు’ పేరుతో ఢిల్లీలో నిరాహార దీక్ష తలపెట్టారనేది బీజేపీ వాదన. దర్యాప్తు, కోర్టుల తీర్పులు, శిక్షలు పార్టీల వాదవివాదాలు, ఎలా ఉన్నా, ఇంతకూ కవిత అరెస్టయితే పరిస్థితి ఏమిటన్నది ఆసక్తికరం. అదే జరిగితే ఎవరికి మేలు,
ఎవరికి దెబ్బ?…సానుభూతి వస్తుంది!
కవిత ఈ అంశాన్ని వీలైనంత మేరకు ‘ఇష్యూ’ చేయాలనే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. సీబీఐ, ఈడీ విచారణలకు అవి చెప్పిన తేదీల్లో హాజరు కాకపోవడం, తను వేరే పనుల్లో ‘బిజీ’గా ఉన్నానని తప్పించుకోవడం, గత్యంతరం లేకపోతే వాటినే తన దగ్గరికి పిలిపించుకుని జవాబులు చెప్పడం ఆమె వ్యూహంగా కనిపిస్తోంది. మహిళా బిల్లుపై ఇప్పటికప్పుడు ఢిల్లీలో దీక్ష నిర్వహించడం వెనక కూడా అదే కారణమని భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టే ఆమె ఈ దీక్ష చేస్తున్నారనుకుంటే, మొన్నటి సమావేశాల్లోనూ, లేకపోతే తను ఎంపీగా ఉన్నప్పుడు దీక్షలు ఎందుకు చెయ్యలేదని విపక్షాల ప్రశ్న. ఏదేమైనా ఆమె ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదలకుండా వీలైనంత మేరకు, అసెంబ్లీ ఎన్నికల వరకు ‘లైవ్’లో పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. నోటీసులు, విచారణలు, వీలైతే అరెస్ట్ కూడా జరిగితే తనపై సానుభూతి వస్తుందని, తద్వారా ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు కలిసొస్తుందని అంచనా. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాకుండా నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో తన అరెస్ట్, తనపై సాగే ‘వేధింపులు’ మేలు చేస్తే చేయొచ్చు. ‘తెలంగాణ బిడ్డను బద్నాం చేస్తున్నారు, జైల్లో వేశారు’ అనే ప్రాంతీయ, ఆడపడచు సెంటిమెంటు జనంలోకి వెళ్తే కొంత ఫలితం తప్పకుండా ఉంటుంది. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించిన నేపథ్యంలో ఇలాంటి ‘సంచలన పరిణామాలు’ దేశవ్యాప్త దృష్టి ఆకర్షిస్తాయి. మరింత ప్రచారం లభిస్తుంది. అయితే దీనిక కొంత మూల్యం కూడా చెల్లించుకోక తప్పదు. అవినీతి ఆరోపణలను ఎన్నికల్లోనే కాదు, భవిష్యత్తులోనూ మోయాల్సి ఉంటుంది. మరి, తాత్కాలిక ప్రయోజనం కోసం శాశ్వతంగా అవినీతి ముద్రను వేసుకోవడానికి ఆమె సిద్ధపడతారా? అన్నది కాలమే తేల్చాలి.
బీజేపీ పరిస్థితి ఏమిటి?
కవిత అరెస్టయితే మొదట బద్నాం అయ్యేది బీజేపీనే. ఈడీ, సీబీఐలు స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలని, అరెస్టుతో తమకు సంబంధం లేదని ఆ పార్టీ చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇలాంటి కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వపక్షీయులను ఉపేక్షిస్తూ, తన ప్రత్యర్థులను మాత్రమే టార్గెట్ చేసుకుంటోందనే ముద్ర మరింత బలంగా పడుతుంది. కవితతో ముడిపడి ఉన్న ‘తెలంగాణ ఆడపడచు’ సెంటిమెంట్‌ను జనం నమ్మితే ఎన్నికల్లో ఆమేరకు నష్టం జరగడం ఖాయం. అందుకే మోదీ సర్కారు ఆమెను అంత త్వరగా అరెస్ట్ చేసే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది. అయితే కవిత నిజంగానే అవినీతికి పాల్పడినట్లు తేలి, జైలుకెళ్తే, బీఆర్ఎస్ పార్టీపై పడే అవినీతి మచ్చను కషాయదళం విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్తే, ఇప్పటికే అవినీతి ఆరోపణలున్న మల్లారెడ్డి వంటి కీలక నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు జైల్లో వేస్తే బీజేపీకి కొంత కలిసి వచ్చే అవకాశమూ లేకపోలేదు.
కాంగ్రెస్ సీన్‌లోకి రాకుండా చేసే కుట్ర
ఈ కేసును కాంగ్రెస్ వైపు నుంచి చూస్తే, ఇదంతా బీఆర్ఎస్, బీజేపీలు ఆడుతున్న నాటకంలా కనిపించడం సహజమే. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించడానికి బీజేపీ ప్రయత్నిస్తుండడం, కాంగ్రెస్ అంతర్గత కలహాలతో రోజురోజుకూ బలహీనపడ్డం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయాలు తమ చుట్టూ తిరిగితే కాంగ్రెస్‌ను శాశ్వతంగా కనుమరుగు చేయొచ్చనే ఉద్దేశపూర్వకమైన, లేకపోతే యాదృచ్ఛిక వ్యూహం గులాబీ, కమలం పువ్వులకు ఉందేమోనన్న అనుమానం కూడా రావొచ్చు. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. తమ ప్రయోజనాల కోసం శత్రువుతోనైనా చేతులు కలిపిన చరిత్రలు ఎన్నో ఉన్నాయి కదా.