ఆ దేవుడు ఆదేశిస్తే..ఈ తలైవా పాటిస్తాడు... - MicTv.in - Telugu News
mictv telugu

ఆ దేవుడు ఆదేశిస్తే..ఈ తలైవా పాటిస్తాడు…

May 15, 2017

రాజకీయాల్లోకి వ‌చ్చే ఉద్దేశం లేద‌ని సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌ స్ప‌ష్టంచేశాడు. అది దేవుడి ఆజ్ఞ అయితే మాత్రం తాను క‌చ్చితంగా ఆ దిశ‌గా ఆలోచిస్తాన‌ని చెప్పాడు. ఒక‌వేళ రాజ‌కీయాల్లోకి వ‌స్తే మాత్రం నిజాయ‌తీగా ప‌నిచేస్తాన‌ని, డబ్బు కోసమే ప‌నిచేసేవాడిని ద‌గ్గ‌రికి కూడా రానివ్వ‌న‌ని ర‌జ‌నీ అన్నాడు.

చెన్నైలో అభిమానుల‌తో అత‌ను ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యాడు. మ‌న జీవితంలో ఏం చేయాలో దేవుడే నిర్ణ‌యిస్తాడు. ప్ర‌స్తుతానికి ఆయ‌న న‌న్ను ఓ న‌టుడిగా ఉండాల‌నుకున్నారు. నా బాధ్య‌త‌ను నేను నెర‌వేరుస్తున్నాను. ఒక‌వేళ దేవుడు నిర్ణ‌యిస్తే నేను రాజ‌కీయాల్లోకి కూడా వ‌స్తా. డ‌బ్బు కోసం ప‌నిచేసేవాళ్ల‌తో క‌లిసి ప‌నిచేయ‌ను అని ర‌జ‌నీ అన్నాడు.

రెండు ద‌శాబ్దాల కింద‌ట కొంత‌కాలం తాను రాజ‌కీయాల్లో ఉన్న విష‌యాన్ని ర‌జ‌నీ గుర్తుచేసుకున్నాడు. అదొక పొలిటిక‌ల్ యాక్సిడెంట్‌గా అత‌ను అభివ‌ర్ణించాడు. 1996లో జ‌య‌ల‌లితకు వ్య‌తిరేకంగా ర‌జ‌నీ ప్ర‌చారం చేశాడు. అత‌ని ప్ర‌చారంతో ఆ ఎన్నిక‌ల్లో జ‌య ఓడిపోయారు. 21 ఏళ్ల కింద‌ట ఓ కూట‌మికి మ‌ద్ద‌తు ప‌లికి త‌ప్పు చేశాను. అదొక పొలిటిక‌ల్ యాక్సిడెంట్‌. అప్ప‌టి నుంచి చాలా మంది నేత‌లు నా పేరును త‌ప్పుగా వాడుకుంటూనే ఉన్నారు.

నేను ఏ పార్టీలో చేర‌డం లేద‌ని ఈ సంద‌ర్భంగా చెప్ప‌ద‌ల‌చుకున్నా అని ర‌జ‌నీ స్ప‌ష్టంచేశాడు. మందు, సిగ‌రెట్‌ల‌కు దూరంగా ఉండాల‌ని అభిమానుల‌కు ర‌జ‌నీ సూచించాడు. తాను వీటి వ‌ల్ల చాలా బాధ‌లు అనుభ‌వించాన‌ని చెప్పాడు.

HACK:

  • Thalivaa, Superstar Rajinikanth declared that he is not interested in politics.
  • If God ordered him to come in politics then only he will think about it and decided.