మోదీకి చేతకాకపోతే.. కేసీఆర్‌లాంటివారికి అధికారాన్ని అప్పగించండి: కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

మోదీకి చేతకాకపోతే.. కేసీఆర్‌లాంటివారికి అధికారాన్ని అప్పగించండి: కేటీఆర్

April 7, 2022

bfcbfcb

”దేశంలో ప్రభుత్వాన్ని నడపటం మాకు చేతకాదు. మేము తప్పుడు మాటలు చెప్పేటోళ్లం. పచ్చి అబద్ధాలు మాట్లాడుతాం. నమ్మించి మోసం చేసేటోళ్లం. రైతులంటే మాకు ప్రేమ లేదు. మాకు కార్పొరేట్లు అంటేనే ప్రేమ అని చెప్పండి. పక్కకు తప్పుకొండి. మోదీకి చేతకాకుంటే అధికారం కేసీఆర్‌కు అప్పగించండి. పదిరోజుల్లో మీ సమస్యలకు పరిష్కారం చేసి చూపించే పూర్తి బాధ్యత మాది” అని గురువారం కేటీఆర్ అన్నారు.

సిరిసిల్లలో రైతులు చేపట్టిన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..”రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ఏడేళ్ల క్రితం మోదీ హామీ ఇచ్చారు. ఆయన చెప్పినట్లు ఆదాయం రెట్టింపు అయిందా?. చాయ్ పే చర్చ అని చెప్పి మోదీ అధికారంలోకి వచ్చారు. ఇవాళ దేశమంతా రైతుల కష్టాలు పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై మాత్రమే చర్చ జరుగుతోంది.

2014కి ముందు కూడా క్రూడాయిల్ ధర 105 డాలర్లున్నప్పుడు పెట్రోల్ ధర ఉన్నప్పుడు రూ. 75 మాత్రమే. ఇప్పుడు క్రూడాయిల్ 105 డాలర్లే ఉంటే పెట్రోల్ ధర రూ. 120కి చేరింది. చమురు ధరల పెరుగుదల కాంగ్రెస్ వైఫల్యమని గతంలో మోదీ అన్నారు. ఇప్పుడు ఎక్సైజ్ సుంకాన్ని రూ. 80కి పెంచి ప్రజల నడ్డి విరిచారు. 2014కి ముందు గ్యాస్ సిలిండర్ ధర రూ. 410 ఉండేది. మోదీ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర రూ. వెయ్యి దాటింది. గ్యాస్ సిలిండర్ పై రాయితే ఎత్తివేయడమే అధిక ధరకు కారణం. రైతుల నిరసన సెగ మోదీకి తగలాలి. రైతులంతా వరి వేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెచ్చగొట్టారు. ధాన్యాన్ని సీఎం కొనాల్సిన పనే లేదని.. కేంద్రంతో చెప్పి ప్రతి గింజా కొనిపిస్తాం” అని కేటీఆర్ అన్నారు.