మోదీ చెబితే.. పుతిన్ వింటాడు: ఉక్రెయిన్ - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ చెబితే.. పుతిన్ వింటాడు: ఉక్రెయిన్

February 24, 2022

MODI

ఉక్రెయిన్ దేశంపై రష్యా దేశం చేస్తున్న దాడులు యావత్ ప్రపంచ దేశాలను కదిలిస్తున్నాయి. అయ్యో దేవుడా రెండు దేశాల మధ్య శాంతిని ప్రసాదించండి అంటూ ప్రజలు కోరుకుంటున్నారు. ఉక్రెయిన్‌పై జరుగుతున్న దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్న ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా గురువారం మీడియాతో మాట్లాడారు. “రష్యాది సైనిక చర్య కాదు. యుద్ధమే. రష్యా ఉన్నట్టుండి మూకుమ్మడిగా దాడి చేసింది. ఉక్రెయిన్‌ రాజధాని నగరం శివార్లలో కొన్ని చోట్ల దాడులు జరగ్గా, మా సైనికులతో పాటు సాధారణ ప్రజలు కూడా అనేకమంది మృతి చెందారు. అనేక మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికైనా పుతిన్‌ ఈ దాడులు ఆపాలి” అని ఆయన పేర్కొన్నారు.

 

అంతేకాకుండా ఈ సంక్షోభ సమయంలో భారతదేశం తమ దేశానికి అండగా నిలవాలని కోరారు. ఇప్పటికే జపాన్‌ సహా పలు దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటించాయి. రష్యాతో భారత్‌కు సత్సంబంధాలు ఉండొచ్చు గానీ, పరిస్థితులు క్షీణిస్తున్నందున తమకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. “భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, గౌరవనీయులైన నేతల్లో మీరు ఒకరు. రష్యాతో మీకు విశేష, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ మోదీజీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మీరు మాట్లాడితే స్పందిస్తారు అనే నమ్మకం నాకు ధృడంగా ఉంది. దయచేసి మాట్లాడండి” అంటూ విజ్జప్తి చేశారు.