బీఆర్‌ఎస్ కాకపోతే.. మరొకటి పెట్టుకోండి: బండి సంజయ్ - MicTv.in - Telugu News
mictv telugu

బీఆర్‌ఎస్ కాకపోతే.. మరొకటి పెట్టుకోండి: బండి సంజయ్

April 28, 2022

కేసీఆర్‌పై, టీఆర్ఎస్ నాయకులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో టీఆర్ఎస్‌ ప్లీనరీ వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రధాని మోదీపై, బీజేపీ నాయకులపై మండిపడుతూ, పలు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీని పరిపాలన విషయంలో ఇతర దేశాల అధ్యక్షులు మెచ్చుకున్న విషయాన్ని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలి. మేం మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రం గురించే మాట్లాడాం. నువ్వే దేశం గురించి మాట్లాడుతున్నావు. నువ్వే అంటివి కదా తెలంగాణ ధనిక రాష్ట్రమని, మరి రూ. 4లక్షల కోట్ల అప్పులు ఎట్లా చేశావ్’ అని ప్రశించారు.

రాష్ట్రాన్ని అప్పుల పాలుజేసీంది కేసీఆర్ కుటుంబమేనని విమర్శించారు. ‘సంపాదించుకుంటున్నది కేసీఆర్ కుటుంబమే. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించకుండా కేంద్రం పైనే ఆరోపణలా? మహిళలను గౌరవించే సంస్కారం లేని పార్టీ టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఆస్తులు వెయ్యి కోట్లు. మరి కేసీఆర్ ఆస్తులెంత? దేశానికే క్యాన్సర్‌గా మారిన మజ్లిస్‌ను పక్కన పెట్టుకున్నారు” అని దుమ్మెత్తిపోశారు.  టీఆర్ఎస్‌ను భారత రాష్ట్ర సమితిగా మార్చాలన్న ప్రతిపాదన వచ్చిందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బండి ఎద్దేవా చేశారు. ‘బీఆర్ఎస్ కాకపోతే, అంతర్జాతీయ రాష్ట్ర సమితి పెట్టుకోండి. అది కాకపోతే మరోకటి పెట్టుకోండి అని బండి సంజయ్’ ఎద్దేవా చేశారు.