మీపై మీకే నమ్మకంలేదే.. పాక్ ఆర్మీ చీఫ్‌పై రావత్ సెటైర్
ఆర్టికల్ 370 రద్దును జీర్ణించుకోలేని పాక్ తన కడుపు మంటను వెళ్లగక్కుతోంది. రోజుకొక నాయకుడు అన్నట్టు భారత్‌పై విషం చిమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో జరుగుతున్న నరమేధానికి చివరి బుల్లెట్ వరకు పోరాడతామని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జావేద్ బజ్వా తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వాళ్లలా అనడం మనం వినడమేనా? వారికి ధీటైన సమాధానం ఇవ్వాలి కదా. జావేద్ వీరావేశ వ్యాఖ్యలపై భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఘాటుగా స్పందించారు. ఏదైనా హింస సృష్టించాలని చూస్తే భారత్ నుంచి తప్పించుకోవడం పాకిస్థాన్ వల్ల కాదని హెచ్చరించారు.
పాక్ ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచివుందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయని, అయితే ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని బిపిన్ రావత్ తెలిపారు. పాకిస్థాన్ ఎల్‌వోసీ దిశగా భారీగా దళాలను తరలించే ప్రయత్నం చేస్తోందని, దీనిపై తాము అప్రమత్తంగానే ఉన్నామని స్పష్టంచేశారు. అసలు పాకిస్థాన్‌కు తమ సొంత బలగాలపైనే నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. అందుకే తరచుగా అణ్వాయుధాల గురించి మాట్లాడుతూ బెదిరింపులకు దిగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.