ధరలు తగ్గాలంటే..ఆగస్టు వరకు ఆగాల్సిందే.. - MicTv.in - Telugu News
mictv telugu

ధరలు తగ్గాలంటే..ఆగస్టు వరకు ఆగాల్సిందే..

June 17, 2022

తెలంగాణ రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సామాన్య ప్రజలు పెరిగిన ధరలను చూసి, కూరగాయలను కొనాలా? వద్దా? అనే అయోమాయంలో పడుతున్నారు. టమాటల నుంచి నిమ్మకాయల వరకు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో వ్యాపారవేత్తలు రాష్ట్రవ్యాప్తంగా కూరగాయల ధరలు తగ్గాలంటే ఆగస్టు వరకు ఆగాల్సిందేనని అంటున్నారు. ఇందుకు కారణం.. ప్రస్తుతం రాష్ట్రంలో కూరగాయల పంటలు అంతగా లేవు. పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

ఈ క్రమంలో పొలంలో కిలో టమాటా ధర రూ.10 ఉంటే నగరానికి వచ్చేసరికి రెట్టింపవుతోంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా అంకాపూర్ నుంచి మాత్రమే కొద్దిమేర టమాటా వస్తోందని చిరు వ్యాపారులు తెలిపారు. మిగతాది అంతా రాజస్థాన్‌లోని జోధ్‌పుర్, మహారాష్ట్రలోని నాసిక్, లాతూర్, కర్ణాటకలోని మీతామణి, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి వస్తోంది. ఇప్పుడిప్పుడే టమాటా విత్తనాలు వేయడం, నారు నాటడం తెలంగాణలో సాగుతోంది. ఆగస్టు నాటికి టమాటాతోపాటు ఇతర కూరగాయలు అందుబాటులోకి రానున్నాయి. అప్పటివరకు ప్రజలు ఆగాల్సిందేనని ప్రజలకు వ్యాపారస్థులు సూచించారు.

టమాటా ధరలు కిలో రూ.20లోపు దొరకాలంటే ఆగస్టు వరకూ వేచి ఉండాల్సిందే అని వ్యవసాయ మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ” గుమ్మడిదల, సిద్దిపేట, వికారాబాద్, చేవెళ్ల, గద్వాల్, గజ్వేల్, మహబూబ్ నగర్ ప్రాంతాల నుంచి విరివిగా టమాటా వచ్చే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూల్, మదనపల్లితోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా పెద్దమొత్తంలో నగరానికి చేరుతుంది. గత ఏడాది జూన్ 18న బోయినపల్లి హోల్సేల్ కూరగాయల మార్కెటకు 1550 క్వింటాళ్ల వరకూ టమాటా వస్తే ఈ ఏడాది ఇదే రోజున కేవలం 1090ల క్వింటాళ్లు వచ్చాయి. మిగతా వాటిదీ అదే పరిస్తితి, రైతుబజారులో సోమవారం టమాటా కిలో రూ.50 ఉంటే బయట మార్కెట్లో రూ. 75-89 వరకు అమ్ముతున్నారు. తెల్ల వంకాయ రూ. 35 ఉంటే బయట మార్కెట్లో రూ.55 పలుకుతోంది. బీన్స్ కిలో రూ.65 ఉంటే రిటైల్ మార్కెట్లో రూ. 79-100 వరకు అమ్ముతున్నారు. దొండకాయ మాత్రం రూ.50లోపు దొరుకుతోంది” అని అన్నారు.