తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా మహిళల జోలికోస్తే, ఎంతిటి వారినైనా ఉపేక్షించేది లేదని, తాట తీస్తామని అదనపు డీజీపీ, ఉమెన్ సెఫ్టీ విభాగం అధికారి స్వాతి లక్రా హెచ్చరించారు. గద్వాల జిల్లాలో నేడు ఆమె స్త్రీ బాలల సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు.
అనంతరం స్వాతి లక్రా మాట్లాడుతూ.. ”భరోసా కేంద్రాలతో బాధిత మహిళలకు తక్షణ సాయం అందుతుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళ రక్షణ కోసం కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. చట్టాలపై ప్రతి మహిళల అవగాహన కలిగి ఉండాలి. ఎవరైనా మహిళల జోలికొస్తే ఊరుకునేది లేదు. తాట తీస్తాం. వేధింపులకు గురౌతున్న బాధిత మహిళల కోసమే ఈ భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. పోక్సో, లైంగిక దాడి కేసుల్లో బాధితులకు ఈ భరోసా కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సఖీ, షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించింది. మానసిక, శారీరక వేధింపులకు గురయ్యే వారికి భరోసా కేంద్రం తక్షణ సహాయం అందిస్తుంది” అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, గద్వాల జిల్లా జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య, జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, పలువురు పోలీసులు పాల్గొన్నారు.