ఆ పని చేయకపోయుంటే తెలంగాణ మరో గుంటూరో, కర్నూలో అయ్యేది - Telugu News - Mic tv
mictv telugu

ఆ పని చేయకపోయుంటే తెలంగాణ మరో గుంటూరో, కర్నూలో అయ్యేది

May 1, 2020

If that does not work, Telangana will be in another Guntur or Kurnool

లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయకుంటే తెలంగాణ మరో కర్నూలు కానీ, మరో గుంటూరు కానీ అయ్యుండేదని తెలంగాణ ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నేడు తెలంగాణలో 6 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో కరోనా నెమ్మదిగా తగ్గుముఖం పడుతోందన్నారు. రాష్ట్రంలో కరోనా టెస్టులు పెద్ద సంఖ్యలో నిర్వహించడంలేదని, అందుకే కేసులు తక్కువగా వస్తున్నాయంటూ విపక్షాలు ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. పరీక్షలు సరిగా చేయడంలేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని.. ఎక్కడ పడితే అక్కడ పరీక్షలు చేయొద్దని ఐసీఎంఆర్ చెప్పిందని స్పష్టం చేశారు. 

ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణలో 90 శాతం కేసులకు మర్కజ్ లింకులే కారణం.  ముంబయి, బెంగళూరు నగరాల స్థాయిలో జనాభా కలిగివున్న హైదరాబాదులో మేము మర్కజ్ కేసులను వెంటాడి పట్టుకుని ఉండకపోతే, దేశంలోనే అత్యధిక కేసులు హైదరాబాద్‌లోనే నమోదయ్యేవి. విదేశాల్లో కరోనా ఉన్నదని తెలిసి కూడా ఢిల్లీలో మర్కజ్‌కు అనుమతి ఇచ్చింది బీజేపీనే. ఢిల్లీలో పోలీసులు, శాంతిభద్రతలు మీ అధీనంలోనే ఉండి కూడా ఏం చేశారు? బాధ్యత లేకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారు. మర్కజ్‌తో లింకున్న 1244 మందిని గుర్తించి వారిని క్వారంటైన్‌కు తరలించే ప్రయత్నం చేస్తే మా పోలీసులు, వైద్య ఆరోగ్య సిబ్బందిపైనా దాడులు జరిగాయి. మాకు తుమ్ములు లేవు, దగ్గు లేదు, జలుబు, జ్వరం లేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసినా పట్టుదలగా వ్యవహరించాం. వారిలో 200కి పైగా పాజిటివ్‌ అని తేలింది.  తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని కరోనా ప్రభావాన్ని గణనీయంగా నియంత్రించింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 47 శాతం మంది కోలుకున్నారు. లక్ష మందికి కూడా వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.  తెలంగాణ ప్రభుత్వ పనితీరును కేంద్రం కూడా అభినందించింది. కరోనా మరణాలు దాచేస్తే దాగేవి కావు’ అని ఈటల తెలిపారు.